Telangana Election 2023: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు అడ్డంకులు! ప్రజల నుంచి నిరసన సెగ
Telangana Election 2023: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. తమ సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు.

Telangana Election 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్ని పార్టీల నేతలందరూ ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే ప్రచారంలో కొన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థులను నిరసన సెగలు తగులుతున్నాయి. అభివృద్ది, సంక్షేమ పథకాలపై ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను నిలదీస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి చేదు ఘటనలు బీఆర్ఎస్ అభ్యర్థులకు తరచూ ఎక్కడో ఒకచోట ఎదురవుతున్నాయి.
తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థులకు మరోసారి ఎన్నికల ప్రచారంలో చుక్కెదురైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి ప్రజల నుంచి ఎదురీత తగిలింది. బెల్లంపల్లి పట్టణంలోని 7వ వార్డ్‌లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను స్థానిక మహిళలు నిలదీశారు. తమకు ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని, ఇళ్ల పట్టాలు కొందరికే ఇచ్చారని నిలదీశారు. త్రాగునీటి సమస్య ఇప్పటివరకు పరిష్కరించ లేదని మహిళలు ప్రశ్నించారు. దీంతో దుర్గం చిన్నయ్య వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు నిలదీస్తూనే ఉండటంతో చివరికి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అటు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ రఘునాథపల్లి మండలం పతేషాపూర్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కడియం పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం అక్కడికి వచ్చిన మహిళలు కడియంను బీఆర్ఎస్ హామీలపై నిలదీశారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, తాము ఓటు వేయమంటూ కడియంకు తేల్చిచెప్పారు. పదేళ్ల పాలనలో తమ గ్రామానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, దళితబంధు పార్టీ నేతలకే ఇచ్చుకున్నారని ఆరోపించారు. ఒక్క డబుల్ బెడ్ రూం కూడా తమకు ఇవ్వలేదని, సామాన్యులు ఇచ్చింది ఏమీ లేదని చెప్పారు. దీంతో కడియం వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా మహిళలు వినలేదు. చేసేది ఏమీ లేక అక్కడ నుంచి కడియం వెళ్లిపోయారు.
అటు దేవరకొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌కు కూడా ఎన్నికల ప్రచారంలో ఎదురీత ఎదురైంది. నేరడుగమ్ము మండలం గుర్రపు తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రచారాన్ని గ్రామానికి చెందిన మహిళలు, యువకులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించలేదని నిలదీశారు. మీకు గ్రామంలో పర్యటించే హక్కు లేదని అడ్డుపడ్డారు. అయితే ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలు తగులుతున్నాయి. తమ సమస్యలపై ప్రజలు ఎక్కడిక్కడ ప్రశ్నిస్తూ వస్తోన్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ అభ్యర్థులను కలవరపెడుతోంది. ప్రజల నుంచి వస్తున్న నిరసనలు ఎన్నికల్లో తమను ఎక్కడ కోంపముంచుతాయోననే ఆందోళన గులాబీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.






















