CM Revanth Reddy: 'చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా' - ప్రభుత్వం ఏదైనా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటామన్న సీఎం రేవంత్
Telangana News: ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు.
CM Revanth Reddy Comments On AP Allinace: ఏపీలో ఎన్డీయే కూటమి సంచలన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. చంద్రబాబు (Chandrababu) ఆహ్వానిస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్న రేవంత్.. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు.
'కాంగ్రెస్ పాలనను ఆశీర్వదించారు'
తెలంగాణలో వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేశామని.. లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించారని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నచ్చితేనే ఓటు వేయాలని ప్రచారంలో కోరామని.. తమ పార్టీ అభ్యర్థులు 8 మంది గెలిచారని చెప్పారు. వంద రోజుల పాలన తర్వాత కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. 'అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్ సభ ఎన్నికల్లో వచ్చాయి. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మేం భావిస్తున్నాం. 8 మంది ఎంపీలను గెలిపించి ఆశీర్వదించారు. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. 2019 ఎన్నికల్లో తమకు 3 సీట్లు వేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరింది. బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. ఆ స్థానాల్లో బీజేపీని గెలిపించి అవయవదానం చేశారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ నేతలు గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారు. మెదక్‌లో కాషాయ పార్టీ విజయానికి హరీశ్ రావు సహకారం అందించారు.' అంటూ రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.
అటు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ కార్యవర్గం సభ్యులు అభినందించారు. గతంలో 3 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ .. ఇప్పుడు 8 స్థానాలకు చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి ఇతరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన కాంగ్రెస్ ఎంపీలు
అటు, కాంగ్రెస్ ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం ఉదయం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంను కలిసి సన్మానించారు. వారితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన వారిని రేవంత్ అభినందించారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో తన సమీప ప్రత్యర్థి బూర నర్యయ్య గౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు, సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ నుంచి 2,20,339 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.