AP Election Campaign: ఏపీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు చూస్తున్నది టీజరే, వారి ఎంట్రీతో దడదడే!
Star Campaigners In AP Elections 2024: ఏపీలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. అయితే, అసలు సిసలు ప్రచారం ముందుందని అంటున్నారు పరిశీలకులు.
AP Election Campaign: ఏపీ(Andhrapradesh)లో శనివారం ఒక్క రోజు పరిస్థితిని గమనిస్తే.. చెవులు దద్దరిల్లిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ(YSRCP), మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(TDP), ఇంకో వైపు.. కాంగ్రెస్(Congress party) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)లు భారీ ఎత్తున సభలు నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్, అటు టీడీపీ అదినేత చంద్రబాబు కూడా.. పెద్ద ఎత్తున ఈ సభల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇక, పార్టీ నేతలతో నిర్వహించిన కార్యక్రమాల్లో షర్మిల రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికలకు ఇది నాంది అన్నట్టుగా మూడు పక్షాలు కూడా.. మైకులు దద్దరిల్లేలా విమర్శలు సంధించుకున్నారు.
ప్రచార పర్వం మొదలు..
విశాఖలో వైసీపీ అధినేత జగన్(YS Jagan).. ఎన్నికల శంఖం పూరించారు. `సిద్ధం`(Sidhdham) పేరుతో నిర్వహించిన సభలో ఎన్నికలకు తాము సిద్ధయ్యామని స్పష్టం చేశారు. ఇక, రా.. కదలిరా!(Raa kadali raa) సభలతో టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) పార్లమెంటు స్థాయి నియోజకవర్గాల్లో కొన్నాళ్లుగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా వచ్చే ఎన్నికలకు రెడీ అయిపోయామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా చేసేందుకు వైఎస్ షర్మిల చేపట్టిన యాత్రలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఆయా సభలు, యాత్రల్లో ఒకరిపై ఒకరు విమర్శలతో రెచ్చిపోతున్నారు.
విమర్శల వేడి
ఒకరు రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని అంటే.. మరొకరు.. రాష్ట్రానికి ఉన్న శకుని వదిలిపోతాడని మాటల తూటాలు పేల్చుకున్నారు. అటు వైపు మాటల తూటాలు పేలితే.. ఇటు వైపు అంతకుమించిన బాంబులే పేలాయి. వయసు ఫ్యాక్టర్ కూడా రాజకీయాల్లోకి వచ్చేసింది. సీఎం జగన్.. చంద్రబాబును 75 ఏళ్ల వృద్ధుడు(aged) అని పిలిస్తే.. అదే చంద్రబాబు తనకు వయసుతో సంబంధం లేదని.. ఆలోచనల్లో తాను యువకుడినేనని చెప్పుకొచ్చారు. వచ్చే 20 ఏళ్లకు రాష్ట్రం(state) ఎలా ఉండాలో ఇప్పుడే ఆలోచిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా.. ఇరు పక్షాల మధ్య పోటా పోటీ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. షర్మిల ఏకంగా.. అన్న సీఎం జగన్‌పైనా, అధికార పార్టీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఎటు విన్నా.. అవే
దీంతో ఎటు చూసినా.. జనాలకు నాయకుల ప్రసంగాలే(leaders speeches) వినిపించాయి. బయటకు వెళ్లినా.. ఇళ్లలో టీవీలు పెట్టినా.. అంతా ప్రసంగాల పరంపర, విమర్శల జోరు, పార్టీల పాటలు.. ఇలా అబ్బో అనిపించేలా ప్రచార హోరు హోరెత్తిపోతోంది. అయితే.. కథ ఇక్కడితో అయి పోలేదు. అసలు సిసలు ప్రచారం ముందుందని అంటున్నారు పరిశీలకులు. స్థార్ కాదు.. ఫైవ్ స్టార్ క్యాంపెయినర్లుగా పేరున్న వారు రాష్ట్రంలోకి త్వరలోనే అడుగు పెట్టనున్నారు. వీరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi), కేంద్ర మంత్రి అమిత్ షా(Amith Sha), ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్(Yogi adityanath) వంటివారు బీజేపీ తరఫున రానున్నారు.
వచ్చే వారు ఉద్ధండులే!
అదేసమయంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఆయన మెగా కుటుంబం(Mega Family) నుంచి నాగబాబు, రామ్ చరణ్‌లు ఈసారి ప్రచారానికి రానున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సీఎం జగన్ మాతృమూర్తి విజయమ్మ కుమారుడి పక్షాన మైకు పట్టుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది ఇంత వరకు రెండు శిబిరాల్లో ఎవరూ ధ్రువీకరించ లేదు. అలాగే ఖండించనూ లేదు. టీడీపీ నుంచి నారా ప్యామిలీ, నారా లోకేష్, బ్రాహ్మణి, బాలయ్య.. వంటివారు దిగిపోనున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరింత మంది ప్రచారం చేయనున్నారు. ఇవన్నీ ప్రధాన పార్టీలు అయితే.. ప్రజాశాంతి, జై భారత్ నేషనల్ పార్టీ సహా కమ్యూనిస్టులు కూడా అరంగేట్రం చేయనున్నారు. ఇక, అప్పుడు చూడాలి రాష్ట్రంలో రాజకీయం అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. విమర్శల జోరు.. హోరుతో మైకులు దద్దరిల్లిపోవడం ఖాయమని చెబుతున్నారు.