Songa Roshan: తెలుగుదేశానికి తీరిన చింతలపూడి చింత, సొంగా రోషన్ కు నియోజకవర్గ బాధ్యతలు
Chinthalapudi News: చింతలపూడి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఎన్నారై సొంగా రోషన్ కు కట్టబెట్టిన చంద్రబాబు, నైరాశ్యంలో మాజీమంత్రి పీతల సుజాత
TDP News: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సీట్ల ఎంపికపై తెలుగుదేశం (TDP)దృష్టిసారించింది. పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధినేత దృష్టిసారించారు. ఇప్పటికే నూజివీడు తెలుగుదేశం ఇన్ ఛార్జిగా పార్థసారథిని నియమించిన తెలుగుదేశం...ఇప్పుడు తాజాగా చింతలపూడి (Chinthalapudi)ఇన్ఛార్జిగా సొంగా రోషన్(Songa Roshan) కుమార్ ను నియమించింది.
చింతలపూడి చింత తీరింది
తెలుగుదేశం పార్టీకి చింతలపూడి అభ్యర్థి చింత తీరిపోయింది. అటు కార్యకర్తలు, సానుభూతిపరులకు సైతం క్లారిటీ వచ్చేసింది. అధినేత చంద్రబాబాబు ఆదేశాలతో చింతలపూడి తెలుగుదేశం(TDP) పార్టీ ఇన్ ఛార్జిగా సొంగా రోషన్(Songa Roshan) కుమార్ ను తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు. చింతలపూడి నియోజకవర్గం టిక్కెట్ రేసులో ముగ్గురు నేతలు ఉండటంతో కేడర్ అయోమయంలో పడింది. మాజీమంత్రి పీతల సుజాత(Sujatha)తోపాటు అనిల్ బొమ్మాజి, ఆకుమర్తి రామారావు , సొంగా రోషన్ కుమార్ పేర్లు తెరపై ఉండటంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అనిల్, రోషన్‌లలో ఒకరికి టికెట్ ఖాయమని నియోజకవర్గంలో చర్చ జరిగింది. అలాగే ఇద్దరు నేతలు కలిసి ఎవరికి టికెట్ దక్కినా గెలుపు కోసం పనిచేయాలని చర్చించుకున్నారు. చివరికి ఎన్నారై రోషన్ కుమార్‌కు చింతలపూడి టికెట్ దక్కింది.
నియోజకవర్గంపై పట్టు
తెలుగుదేశం టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సొంగా రోషన్ కుమార్ కొద్ది రోజులుగా నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడమే గాక... పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మొత్తానికి చంద్రబాబును(CBN), లోకేశ్(Lokesh) ను మెప్పించి నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి దక్కించుకున్నారు. రోషన్ తోపాటు మాజీ ఐఏఏస్ అధికారి కుమారుడు అనిల్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆయన సోదరుడు విజయ్ కుమార్ సంతనూతలపాడు ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసి ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. కాబట్టి ఆయనకే టిక్కెట్ ఖాయమని అందరూ భావించారు. నియోజకవర్గంలోనూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చివరి నిమిషం వరకు టిక్కెట్ రేసులో నిలిచినా..ఎన్ ఆర్ ఐ రోషన్ కుమార్ వైపే పార్టీ మొగ్గు చూపింది.
ఇదే టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీమంత్రి పీతల సుజాతకు ఈసారి తెలుగుదేశం పార్టీ మొండిచేయి చూపింది. చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. జనరల్ స్థానంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సభ్యుడు కోటగిరి విధ్యాధరరావు వరుసగా ఐదుసార్లు ఇక్కడి నుంచే గెలుపొందారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాగా...తెలుగదేశం కొంత పట్టు కోల్పోయినా 2014 ఎన్నికల్లో మాజీమంత్రి పీతల సుజాత మరోసారి ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగురవేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ గాలిలో ఆమె కొట్టుకుపోగా ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యే ఎలిజా ప్రాతనిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలిజాకు వైకాపా టిక్కెట్ నిరాకరించింది. కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపనుండటంతో ఈసారి చింతలపూడి ఎన్నిక రసవత్తంగా ఉంది. అటు టీడీపీ నుంచి వైసీపీ నుంచీ కొత్త అభ్యర్థులే బరిలో దిగనున్నారు. తెలుగుదేశం అభ్యర్థి ఎన్నారై కావడంతో అందుకు దీటైన అభ్యర్థినే వైసీపీ నిలబెట్టే అవకాశం ఉంది.