TDP In NDA: పొత్తుపై కదలిక, వచ్చే వారం ఎన్‌డీఏలో చేరనున్న టీడీపీ
TDP Join To NDA : ఈ నెల 19 లేదా 20న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారన్న వార్తలు వస్తుండడంతో పొత్తు ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.
TDP News: ఎన్‌డీఏలో తెలుగుదేశం పార్టీ చేరికపై సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ నుంచి పొత్తు కోసం తెలుగుదేశం, జనసేన పార్టీలు ముందు నుంచీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ రెండు పార్టీలే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో రెండు వారాలు కిందట తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు బీజజేపీ పెద్దలు నుంచి ఆహ్వానం వచ్చింది. వెంటనే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బీజేపీ అగ్ర నాయకులు అమిత్‌షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ చర్చలు సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఖాయమని, సీట్ల పంపకాలు తరువాయి అన్న ప్రచారం జరిగింది. రోజులు గడిచాయి కానీ ఇప్పటి వరకు పొత్తుపై టీడీపీ గానీ, బీజేపీ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇరుపార్టీల మధ్య సీట్లకు సంబంధించిన చర్చలు సానుకూలంగా జరగకపోవడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారన్న వార్తలు వస్తుండడంతో పొత్తు ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.
రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
ఈ నెల 19 లేదా 20 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు, బీజేపీ పెద్దలు మధ్య సీట్ల పంపకాలు వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురానున్నారు. అదే రోజు చంద్రబాబు ఎన్‌డీఏలో చేరయడం ఖాయమంటున్నారు. తెలుగుదేశం, జనసేన నేతలతో బీజేపీ సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు పార్టీల నేతల చర్చలు తరువాత ఏయే సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తారన్న దానిపై ప్రకటన గానీ, ముఖ్య నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గానీ వెళ్లడించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో సీట్ల పంపకాల ప్రక్రియ కొలిక్కి రాకపోతే ఇబ్బంది కలుగుతుందన్న భావనతో మూడు పార్టీల అగ్ర నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టేనా
బీజేపీ, టీడీపీ మధ్య ఇన్ని రోజులపాటు చర్చలు ప్రక్రియ తేలకపోవడానికి ప్రధాన కారణం బీజేపీ అగ్రనాయకత్వం కోరిన సీట్లుగానే చెబుతున్నారు. ఎనిమిది నుంచి పది వరకు పార్లమెంట్ స్థానాలు, మరో 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థానాలను బీజేపీ అగ్రనాయకత్వం కోరినట్టు చెబుతున్నారు. ఇదే ఇరు పార్టీల మధ్య పొత్తు ప్రతిష్టంభనకు కారణమైంది. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం తెలుగుదేశం పార్టీకి ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో పార్లమెంట్ స్థానాలను సాధించడం కూడా ముఖ్యం. కేంద్రంలో బీజేపీ నుంచి పనులు చేయించుకోవాలంటే ఎంపీ స్థానాలు అధికంగా కావాలి. కానీ, బీజేపీ, జనసేన పార్టీలకు సగం వరకు ఎంపీ స్థానాలు ఇవ్వడం వల్ల టీడీపీ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు భావించారు. ఇదే విషయంపై టీడీపీ కీలక నాయకులతో మాట్లాడిన చంద్రబాబు.. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లడానికి రెడీ అయినట్టు పార్టీ వర్గాల బోగట్టా. బీజేపీ కోరినట్టు అన్ని స్థానాలు ఇస్తారా..? లేక మరో మార్గం గుండా బీజేపీ నాయకత్వాన్ని ఒప్పిస్తారా..? అన్నది వేచి చూడాలి.