KTR Comments On Ranjit Reddy: చేవెళ్లలో 13న కేసీఆర్ బహిరంగ సభ- విశ్వేశ్వరెడ్డిలానే రంజిత్ రెడ్డి అవుతారు: కేటీఆర్
KTR Comments On Congress And Ranjit Reddy: ఇటీవలే పార్టి మరిన రంజిత్ రెడ్డికి ఉన్నది సొంత బలం కాదని... ఆయన కూడా కొండా విశ్వేశ్వరెడ్డి మాదిరిగానే ఎటూ కాకుండా పోతారని కేటీఆర్ కామెంట్ చేశారు.
Chevella Lok Sabha Constituency: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారంలో ప్రస్తావించాల్సిన అంశాలపై రోజుకో నియోజకవర్గం నేతలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి విజయం సాధించిన రంజిత్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రంజిత్ రెడ్డికి చేసిన అన్యాయం ఏంటీ: కేటీఆర్
పార్టీ వీడిపోతున్న వారిని, ముఖ్యంగా ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రవ విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారంటే..." రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతే ప్రపంచానికి తెలిసింది. 2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చాము. నియోజక వర్గంలో స్వేచ్చ ఇచ్చాం. ఈ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ముందు అశక్తతను వ్యక్త్యం చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి, కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బిఅర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారు.
కవితను అరెస్టు చేసిన రోజే పార్టీ మారారు
పార్టీ సీనియర్ నాయకురాలు తన సోదరి అని చెప్పుకుని కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి… అరెస్టు చేసిన రోజే.. రంజిత్ రెడ్డి నవ్వుకుంటు పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడు. బిఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళారని చర్చించుకుంటున్నారు.
కొండా విశ్వేశ్వరెడ్డి మాదిరిగానే రంజిత్ రెడ్డి
గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరు. అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవు. స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మనుసులు కలిసినంత మాత్రాన మిలాఖత్ అయినంత మాత్రనా.. కాంగ్రెస్ బిఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. ఎంపీ ఎలక్షన్‌లపై కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొని ఉంది. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం. చేవెళ్ల నియోజకవర్గంలో 13న కెసిఆర్ బహిరంగ సభ ఉంటుంది. సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుంది. అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కాసాని విజయం సాధిస్తారు: కేటీఆర్
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని అన్నారు. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి, నాయకుడు కాసాని అంటు కితాబు ఇచ్చారు.