KTR Comments : పిరికిపందల్లా పారిపోయారు - పార్టీ మారిన నేతలపై మండిపడ్డ కేటీఆర్
Telangana Politics : పార్టీ మారిన నేతలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిరికి పందల్లా మారిపోయారన్నారు. చేవెళ్ల పరిధిలో రోడ్ షోలు నిర్వహించారు.
KTR On Leaders : బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంజిత్ రెడ్డి ఎంపీగా, పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించిన వారు తల్లి లాంటి పార్టీకి మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం పోగానే పార్టీ నుంచి పిరికిపందల్లా జారుకున్నారని మండిపడ్డారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. రోడ్ షో నిర్వహించారు.
ప్రసంగంలో కాసాని జ్ఞానేశ్వర్‌పై ప్రశంసలు కురిపించారు. 93 కులాలను ఐక్యం చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్. ఒక బలమైన నాయకుడు బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డాడు. అలాంటి కాసానిని గెలిపించాలి. బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలంటే కాసానిని గెలిపించి బీసీల సత్తా చూపించాలన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 నడిచింది.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పంద్రాగస్టు లోగా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసానికి యత్నిస్తుందని ఆయన తెలిపారు.
అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను ప్రజలకు గుర్తు చేయాలి. రుణమాఫీ, రైతుబంధు వంటి అంశాలను గుర్తు చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 నడిచింది.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ నడుస్తోంది. రైతు రుణమాఫీ పంద్రాగస్టు లోపు చేస్తామంటున్నారు. మళ్లీ మోసపోదామా..? ఒకసారి మోసపోయింది చాలదా..? ఒక్కసారి మోసపోతే మోసం చేసినోనిది తప్పు అయితది. రెండోసారి మోసపోతే ఎవడైతే నమ్మిండో వారిది తప్పు అవుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు 220 సీట్లు, యూపీఏ 150 సీట్లు దాటే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి 12 సీట్లు కట్టబెడితే.. అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ ఇద్దరూ కేసీఆర్ వద్దకు వచ్చి దండం పెడుతారు. తెలంగాణకు ఏం కావాలంటే అది చేస్తాం.. మాకు మద్దతివ్వండి అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో గులాబీ శ్రేణులు గట్టిగా పోరాడి మెజార్టీ స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారతారని ప్రచారం జరిగిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యేప్రకాష్ గౌడ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.