Elections 2024 : కౌంటింగ్ సెంటర్లలో అలజడికి భారీ కుట్ర - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అనుమానాలు
Andhra Politics : ఏపీ కౌంటింగ్ సెంటర్లలో అలజడికి కుట్ర జరుగుతోందని జేడీ లక్ష్మినారాయణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్ల రూపంలో రౌడీల్ని పంపే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
Counting Day : ఏపీలో ఎన్నికలు ఎంత ఉద్రిక్తంగా జరుగుతున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలు ముగిసిపోయినా దాడులు, దౌర్జన్యాలు తగ్గడం లేదు. కౌంటింగ్ రోజు, అనంతరం ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్న ఉద్దేశంతో భద్రతను కట్టు దిట్టం చేస్తున్నారు కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. కౌంటింగ్ సెంటర్లలోనూ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలతో లోపలు కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మినారాయణ కీలకమైన అనుమానాల్ని వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లను తమ వారిని పంపి రగడ సృష్టించేందుకు కొన్ని పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నాయని ఆయన అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు... ఆషామాషీగా ఎన్నికల్లో నిలబడిన స్వతంత్ర అభ్యర్థులతో ఒప్పంద చేసుకుని వారి తరపున తమ వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా కౌంటింగ్ కేంద్రాల్లోకి పంపే ప్రయత్నాల్లో ఉన్నాయని తనకు తెలిసిందని వీవీ లక్ష్మినారాయణ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇది కౌంటింగ్ హాళ్లలో ఉద్రిక్తతకు.. దారి తీసే ప్రమాదం ఉందన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని అందరి దగ్గర నోటరీతో కూడిన అఫిడవిట్ తీసుకోవాలని ఈసీని జేడీ లక్ష్మినారాయణ కోరారు.
It is learnt that the main political parties in AP are influencing the non- serious independent candidates to field their party workers as the counting agents of such independent candidates. This may lead to trouble & disturbance in the counting halls. @ECISVEEP
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) May 27, 2024
ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోతే కొంత మంది అభ్యర్థులు ఘర్షణలకు దిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అదే సమయంలో రాయలసీమ నుంచి పలువురు రిటర్నింగ్ అధికారులపైనా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి. పలువురు తమకు సెలవులు ఇవ్వాలని.. ఐఏఎస్ అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించాని కోరుతూ వ్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు సెలవుపై వెిళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ కౌంటింగ్ ఒత్తిడిని తట్టుకోవడం చిన్న విషయం కాదని.. ఏ చిన్న లోపం జరిగినా ఆదో పెద్ద విషయంగా మారి తన కుర్చీ కిందకే నీళ్లు తెస్తుందని ఎక్కువ మంది అధికారులు మథన పడుతున్నారు.
కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో ఈసీ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. నేర చరిత్ర ఉన్న వారిని అనుమతించే అవకాశం కనిపించడం లేదు. వీవీ లక్ష్మినారాయణ జై భారత్ నేషనల్ పార్టీ తరపున విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ తరపున పలువురు అభ్యర్థులు ఇతర చోట్ల నామినేషన్లు వేశారు.