Elections 2024 : మీ బిడ్డ భూములిస్తాడు కానీ లాక్కోడు - ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జగన్ క్లారిటీ
Andhra Politics : ల్యాండ్ టైటిలింగ్ యాక్ పై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని జగన్ అన్నారు. హిందూపురంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడారు.
Jagan On and titling act : భూమిమీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని భూములు లాక్కోవడానికి కాదని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. మీ బిడ్డ భూములు లాక్కోడని ఇస్తాడని ప్రజలకు హామీ ఇచ్చారు. హిందూపురంలో ఎన్నికల బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేస్తూ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. మీ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు నువ్వు మనిషివేనా అని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందని.. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందన్నారు. కానీ, అలా ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదని.. ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తైన తర్వాత ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్నారు.
ఇలా ఇచ్చే ల్యాండ్ లైటిల్స్ కు ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం చేస్తుందన్నారు. రైతులు తరఫున, భూ యజమానుల తరఫున ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది, వారి పక్షాన నిలబడుతుందని హామీ ఇచ్చారరు. ఇది చేయాలంటే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి కావాల్సి ఉందన్నారు. బ్రిటీష్ కాలం తర్వాత.. ఇప్పుడు వందేళ్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎకరాను సర్వే చేయిస్తున్నామని. సరిహద్దు రాళ్లు పెడుతున్నాం.. రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నామన్నాు. రైతన్నలకే పదిలంగా హక్కు పత్రాలు పంపిణీచేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పూర్తిగా 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం. అప్పుడు ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. పూర్తి హక్కులతో రికార్డ్స్ అప్డేట్ అవుతాయి, సబ్ డివిజన్లు కూడా అవుతాయి. ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్నారు.
ఈ మొత్త అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండపడ్డారు. ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది. పత్రాలల్లో తప్పులు ఉండకూడదని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఫార్మాట్ తీసుకొచ్చాం. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతోందన్నారు. చంద్రబాబు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
మేనిఫెస్టోలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 99 శాతం హామీలు అమలు అయ్యాయన్నారు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడుల పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులతో ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.. అక్కాచెల్లెమ్మలు తమ సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ కానుక. ఇవేవైనా గతంలో జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు. మన బతుకులు బాగుపడాలన్నా. పేదల భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. రెండు బటన్‌లు నొక్కాలని జగన్ పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు.