AP Intelligence Alert : ఏపీలో హై అలర్ట్ - కౌంటింగ్ తర్వాత కూడా కేంద్ర బలగాల పహారా
Andhra News : కౌంటింగ్ అనంతరం కూడా ఏపీలో భారీ హింస చోటు చేసుకునే ప్రమాదం ఇంటలిజెన్స్ హెచ్చరించింది. సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించనున్నారు.
Elections 2024 : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అత్యంత ఉద్రిక్తంగా మారుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాతనే పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. ఇక కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇంకా భారీ హింస చోటు చేసుకుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర ఇంటలిజెన్స్ ఏపీని హెచ్చరించింది. జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందని క.. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఇంటెలిజెన్స్ సూచించింది.
రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ కీలక సూచనలు చేసింది. ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖను కూడా అప్రమత్తం చేసింది. పోలింగ్ తర్వాత పల్నాడు, తాడిపత్రి , తిరుపతి వంటి చోట్ల తవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది.. అల్లర్లకు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేసింది. మరో ఎస్పీని, కలెక్టర్ ను బదిలీ చేసింది.
ఆంద్రప్రదేశ్ లో రాజకీయం సున్నితంగా మారుతోంది. గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై వేధింపులకు పాల్పడ్డారని తాము వచ్చాక వదిలే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. టీడీపీ నేతలు రెడ్ బుక్ తయారు చేసుకున్నామని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తమ ఆస్తులపైనే కాదు అభిమానంపై కూడా వైసీపీ నేతలు దాడి చేశారని..అధికారం చేతులు మారిన తర్వాత సంగతి తేలుస్తామని బహిరంగంగా హెచ్చరికలు చేసుకున్నారు. ఈ పరిణామాలతో కౌంటింగ్ కు ముందు నుంచే పెద్ద ఎత్తున భద్రతను మోహరించాలని అనుకుంటున్నారు.
చంద్రగిరి, పల్నాడు, తాడిపత్రి వంటి ప్రాంతాల్లో రాజకీయం ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటుంది. ఒకరికొకరు రెచ్చగొట్టుకునే రాజకీయాలు చేయడంతో పరిస్థితి దిగజారుతోంది. పోలింగ్ అనంతర హింస మరి టార్గెట్ చేసుకుని మరీ దాడులు చేసినట్లుగా ఉండటంతో బాధితులు ఫలితాల తర్వాత చూస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అదే కనిపిస్తోంది. అందుకే ఇంటలిజెన్స్ భారీ భద్రతా ఏర్పాట్లకు సూచనలు చేసింది.
పోలీసుల నిర్లక్ష్యం వల్లనే పెద్ద ఎత్తన ఘర్షణలు చోటు చేసుకున్నాయని ఈసీ తేల్చడంతో ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేసింది. మరో ఎస్పీని, కలెక్టర్ ను బదిలీ చేసింది. అలాగే మరో పన్నెండు మంది కింది స్థాయి పోలీసు అధికారులపైనా వేటు వేసింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.