Mlc By Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ - నామినేషన్లు ప్రారంభం
Telangana News: వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 9 వరకూ నామినేషన్లు స్వీకరించనుండగా.. 27న పోలింగ్ నిర్వహించనున్నారు.
Ec Notification For Graduate Mlc By Election: వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గురువారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. మే 9 (గురువారం) వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా.. ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 9న రాజీనామా చేయగా.. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవగా.. 2027, మార్చి వరకూ పదవీకాలం ఉంది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మే 27న ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించనుంది.
పట్టభద్రుల ఓటర్లు ఎంతమందంటే.?
కాగా, ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోగా.. వారిలో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ను ఈ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నల్గొండ కలెక్టరేట్ లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటించింది. 2021 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్సీగా బరిలో ఉన్న ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, వెలిచాల రాజేందర్ రావును కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో మల్లన్న ఎమ్మెల్సీగా నిలబెట్టాలని హస్తం పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.