(Source: ECI/ABP News/ABP Majha)
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ ఎంపీలు - విజేతలకు ముఖ్యమంత్రి అభినందనలు
Telangana News: తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎంపీ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన నేతలకు సీఎం అభినందనలు తెలియజేశారు.
Congress Mps Meet CM Revanth Reddy: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసంలో ఆయన్ను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంను కలిసి సన్మానించారు. వారితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన వారిని రేవంత్ అభినందించారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో తన సమీప ప్రత్యర్థి బూర నర్యయ్య గౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు, సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ నుంచి 2,20,339 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అటు, చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసారు. తన గెలుపునకు సహకారం అందించినందుకు ఈ సందర్భంగా మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రిని సత్కరించారు. ఇరువురు నేతలు ఎన్నికల ప్రచారం, ఓటింగ్, ఎక్కెడెక్కడ ఎంత మెజార్టీ వచ్చిందోననే అంశాలపై చర్చించుకున్నారు.
కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 స్థానాలు
తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. మజ్లిస్ పార్టీ తన హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. 2, 3 చోట్ల తప్ప అన్ని స్థానాల్లోనూ మూడో స్థానంలో ఉంది. అటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు అదనం. మంగళవారం ఫలితాల చివరి వరకూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ సాగింది.
Also Read: Telangana Election Results : టెస్ట్ పాసైన రేవంత్ రెడ్డి - ఇక ఐదేళ్లూ ప్రభుత్వానికి ఢోకా లేనట్లే !