Graduate MLC Election : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు ? - బీఆర్ఎస్ , బీజేపీలో కసరత్తు షురూ !
Telangana News : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై బీఆర్ఎస్, బీజేపీ కసరత్తు ప్రారంభించాయి. కాంగ్రెస్ తన అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది.
Graduate MLC Candidates : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది. అదే ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఉపఎన్నిక. మూడేళ్ల క్రితం ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ స్థానం నుంచి గెలిచారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దాంతో రాజీనామా తప్పనిసరి అయింది. ఉపఎన్నిక వచ్చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు. ఆయన గతంలోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో ఉన్నారు.
ఇప్పుడు ఈ స్థానంలో అభ్యర్థుల్ని ప్రకటించడానికి బీజేపీ, బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నాయి. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలం పరిమితంగా ఉంటుంది.విద్యావంతులు ఎవరికి నచ్చితే వారికి ఓటు వేస్తారు. గతంలో విద్యా సంస్థల అధినేత ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా అంగ, అర్థబలాలను ఉపయోగించుకుని విజయం సాధించారు. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి రేసులో కూడా లేరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ హోదాలో ఉండటంతో ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించింది. గ్రాడ్యూయేట్లలో మంచి ఆదరణ ఉన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను ఎంపిక చేసుకుంది.
ఇక బీఆర్ఎస్ కు ఓ రకంగా ఇది సిట్టింగ్ స్థానం. తమ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా వల్ల వచ్చిన ఉపఎన్నిక. అందుకే గెలవడం మరింత ప్రతిష్టాత్మకం. కానీ ఇప్పుడు అభ్యర్థిగా ఎవరిని దింపాలన్నది సమస్యగా మారింది. యువతలో మంచి క్రేజ్ ఉన్న నేతను దింపాల్సి ఉంటుంది. ఈ విషయంలో కొంత మంది యువనేతల పేర్లను బీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తోంది. బీజేపీ నుంచి కూడా కొంత మంది నే్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మే 2వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంటే ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులను ఆలోపు ఖరారు చేయాల్సి ఉంది. మే 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్, జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. జనగామా నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసింది.