కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ
కమ్యూనిస్టు లీడర్లు ఎర్ర గులాబీలని ఎద్దేవా చేశారు బండి సంజయ్. లీడర్లంతా టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారన్నారు.
కమ్యూనిస్టు పార్టీలను ఎర్రగులాబీలుగా అభివర్ణించారు తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్‌కు అమ్ముడు పోయారని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని... ఆ పార్టీ నేతలే బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ లోపాయికారీ ఒప్పందంతో కలిసే పోటీ చేస్తున్నాయని ఆరోపించారు.
మునుగోడు ఉపఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్నాయన్నారు బండి. టీఆర్ఎస్ నియంత పాలనపై పోరాటం చేస్తున్న బీజేపీ గెలుపుతో కేసీఆర్ అహంకారాన్ని అణగదొక్కాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశారని అందుకే ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్న మునుగోడులో బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
తెలంగాణ పదాధికారులు, ముఖ్య నేతలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాగూడెం వద్దనున్న ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ శిబిరం వద్ద జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, జి.వివేక్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి, సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.
టిఆర్ఎస్ పార్టీ 'అవినీతి, నియంతృత్వ, కుటుంబ' పాలనకు వ్యతిరేకంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఈనెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభలో 'కేంద్ర హోంమంత్రి అమిత్ షా' ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వివరించారు. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్నారు.
మునుగోడు సభను విజయవంతం చేద్దామని.. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారన్నారు బండి సంజయ్. ఏ సర్వే చూసినా... బీజేపీకే పట్టం కడుతున్నాయని... అయితే సర్వేలపై ఆధారపడబోమన్న బండి... ప్రజలను మాత్రమే నమ్ముకుంటున్నామన్నారు. మునుగోడు ఉపఎన్నిక 2023లో తెలంగాణలో జరిగే ఎన్నికలకు సెమీఫైనల్స్ వంటివని అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్క నాయకుడు, కార్యకర్త మునుగోడు బహిరంగసభను విజయవంతం చేయడానికి నడుం బిగించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను తేలిగ్గా తీసుకోవద్దని హితవుపలికారు. పార్టీ భవిష్యత్‌కు ఈ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
మునుగోడు ఉపఎన్నిక ముగిసేవరకు ప్రతీ ఒక్క నాయకుడు, కార్యకర్త మునుగోడులో పార్టీ విజయం కోసం 24X7 పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పెద్దనాయకులు, చిన్ననాయకులు అన్న తారతమ్యం లేకుండా పోలింగ్‌బూత్ ఇన్‌ఛార్జ్‌గా సైతం పని చేసి వారికి కేటాయించిన పోలింగ్ బూతుల్లో బిజెపికి మెజార్టీ తీసుకురావాల్సిందని ఆదేశించారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ గ్రాఫ్ పడిపోయిందన్నారు బండి సంజయ్. కెసిఆర్‌ను ప్రజలు విశ్వసించడం లేదన్న బండి... వికారాబాద్ సభే ఇందుకు నిదర్శనమన్నారు. మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి తరలించినా... వికారాబాద్‌లో జరిగిన కేసీఆర్ సభ ఫెయిల్ అయిందని ఎద్దేవా చేశారు. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునే దుస్థితికి కేసీఆర్ చేరుకున్నారన్నారు.
మునుగోడులో ఎగిరేది కాషాయ జెండాయేనన్న బండి.... బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ యుద్ధం నడుస్తోందన్నారు. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని.... ప్రజల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. రాజగోపాల్ రెడ్డిని ప్రజలే గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. 'రాజగోపాల్ రెడ్డి రాజీనామా' తోనే 'గట్టుప్పల్' మండలాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నామన్నారు. పాదయాత్రలో ప్రజలు తండోపతండాలుగా... స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని తెలిపారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ కలిసే మునుగోడు ఎన్నికలో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని... ఆ పార్టీలో లీడర్లంతా బహిరంగంగానే కొట్టుకుంటున్నారన్నారు. చివరికి కాంగ్రెస్‌కు గులాం నబీ ఆజాద్ కూడా రాజీనామా చేశారన్నారు. పార్టీలో పద్దతిగా ఉండే మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీ అధ్యక్షుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే... కాంగ్రెస్ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చన్నారు.
కమ్యూనిస్టు లీడర్లు ఎర్ర గులాబీలని ఎద్దేవా చేశారు బండి. లీడర్లంతా టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారన్నారు. కేసీఆర్ ఇచ్చే మెతుకులకు ఆశపడి ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నారన్నారు. అందుకే విసిగిపోయిన కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రజా సమస్యల కోసం టీఆర్ఎస్ పై పోరాడుతున్న బీజేపీ పక్షాన నిలుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో కొట్లాటలను, టీఆర్ఎస్‌కు అమ్ముడుపోతున్న తీరుతో ఆ పార్టీ క్యాడర్ సైతం బీజేపీతోనే ఉందన్నారు.
అమిత్ షా సభకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రగులుకున్న వేళ.... బీజేపీ గట్టి పోరాటానికి సిద్ధమవుతోంది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 21న మునుగోడులో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. జన సమీకరణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నియోజకవర్గంలో ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతల చొప్పున ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలం సహా మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం 9 మండలాలకు 18 మంది సీనియర్ నాయకులకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించారు.