ఢిల్లీకి చేరిన సీఎం జగన్.. నేడు ప్రధానితో భేటీ
CM Jagan Delhi Tour: సీఎం జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధానితో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

CM JJagan Will Meet Prime Minister Today : సీఎం జగన్మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై సీఎం ప్రధానితో చర్చించే అవకాశముంది. గురువారం రాత్రి ఢిల్లీకి సీఎం చేరారు. ఆయనకు వైసీపీ ఎంపీలు, ముఖ్య నేతలు స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు అపాయింట్‌మెంట్ లభించినట్టు సమాచారం. గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్మోహన్‌రెడ్డి,.. పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, నందిగాం సురేష్, రెడ్డప్ప, అయోథ్య రామిరెడ్డి, వంగా గీతా, చింతా అనురాధ, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్, ఎం గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్ తదితరులతో సీఎం మాట్లాడారు.
సీఎం, ప్రధాని సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం
ప్రదాని మోదీతో సమావేశమవుతున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ, సహకారాలు అందించాలని, తెలంగాణ డిస్కంలు నుంచి రావాల్సి విద్యుత్ బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సీఎం జగన్ ప్రధానితో సమావేశం అవుతుండడంతో ఆసక్తిని రేపుతోంది. చంద్రబాబు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన తరువాతి రోజే ప్రధానితో సమావేశం కావడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగుతోంది. పొత్తుకు దూరంగా ఉండాలని సీఎం ప్రధానిని కోరతారా..? అన్న దానిపైనా రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధానితోపాటు అమిత్ షా, ఇతర కీలక నేతలను సీఎం కలిసే చాన్స్ ఉంది.
బీజేపీ వ్యూహం ఏమిటి..?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో ఒక వైపు అమిత్ షా, జేపీ నడ్డా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సీట్ల పంపకాలపై చర్చలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకపక్క టీడీపీతో చర్చలు జరుపుతూనే.. అదే పార్టీకి రాష్ట్రంలోని ప్రధాన ప్రత్యర్థి, అధికార వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి వెంటనే అపాయింట్‌మెంట్ ప్రధాని ఇచ్చారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న రాజకీయ ఆటలో భాగమేనని పలువురు పేర్కొంటున్నారు. తాము అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే తమకు ఎలానూ జగన్ ఉన్నాడన్న విషయాన్ని తెలుగుదేశం, జనసేన కూటమికి తెలియజేసే ఉద్ధేశంతోనే సీఎం జగన్‌కు వెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు తప్పా.. పార్టీలతో సంబంధాలు పెద్దగా అవసరం లేదన్నది చాలా మంది చెబుతున్న మాట. అందుకు అనుగుణంగానే వారి వ్యూహాలు ఉంటాయని, అందులో భాగమే చంద్రబాబుతో భేటీ అనంతరమే జగన్‌తో ప్రధాని సమావేశమని పలువురు చెబుతున్నారు. సీఎం జగన్, ప్రధాని మోదీ సమావేశం తరువాత రాష్ట్రంలో ఏర్పడనున్న కూటమిలో ఏమైనా మార్పులు ఉంటాయా..? లేదా..? అన్నది చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

