(Source: ECI/ABP News/ABP Majha)
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
Andhra Elections : ఏపీ బేవరెజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని ఈసీ బదిలీ చేసింది. ఎన్నికల సంబంధిత విధుల్లో నియమించవద్దని స్పష్టం చేసింది.
AP Beverages Corporation MD Vasudeva Reddy has been transferred by EC : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. వాసుదేవరెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాసుదేవరెడ్డిని ఎన్నికల సంబంధిత విధుల్లో ఎక్కడా పోస్ట్ చేయవద్దని స్పషటం చేసింది. పోలీసు ఉన్నతాధికారులపైనా బదిలీ వేటు పడనుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో మద్యం విషయంలో కీలకంగా వ్యవహరించే వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు పడటం కీలకంగా మారింది.
మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి వాసుదేవరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. ఏపీలో మద్యం ఉత్పత్తి దగ్గర నుంచి సరఫరా, అమ్మకం వరకూ ప్రతీది ప్రభుత్వ గుప్పిట్లో ఉంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు మద్యం దొరకకుండా చేసి.. అధికార పార్టీకి మాత్రమే అందేలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీకి వచ్చిన ఎన్నికల పరిశీలకులు మద్యం విషయంలో పలు వివరాలు సేకరించారు. ముందస్తుగా ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాలపై ఎలక్షన్ కమీషన్ ఆంక్షలు విధించింది. గత ఏడాది ఇదే నెల విక్రయాల గణాంకాల ఆధారంగా ప్రభుత్వ రిటైల్ దుకాణాలు విక్రయించే మద్యంపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది.
రాజకీయ లబ్ధి కోసం మద్యం దుర్వినియోగం కాకుండా ఎక్సైజ్ అధికారులు ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం సరఫరాను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల సమయంలో పారదర్శకంగా ఉండేలా మద్యం నిల్వల తొలగింపు, విక్రయాలపై రోజువారీ నివేదికలు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి వివిధ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తుండడంతో ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా మద్యం విక్రయాలపై ఆంక్షలను విధించారు. కోటా అమ్మకాలు పూర్తయిపోతూండటంతో మధ్యాహ్నం కల్లా దుకాణాలు మూసివేస్తున్నారు.
ఏపీలో మద్యం పాలసీపై ఎన్నికల కోడ్ రాక ముందు నుంచీ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వాసుదేవరెడ్డి ఏపీ అధికారి కాదు. ఆయన ఐఆర్టీఎస్ అధికారి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటేషన్ పై ఏపీలో పని చేయడానికి వచ్చారు. నాలుగేళ్లుగా ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ లోనే ఉన్నారు. వింత మద్యం బ్రాండ్ల వెనుక ఆయన ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. షాపుల్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదు వసూలు చేస్తున్న వైనం అమ్మకాలు కూడా ఆయన వ్యూహమేనని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డిపై బ దిలీ వేటు వైసీపీ వర్గాల్లోనూ సంచలనంగా మారింది.