Congress APP Alliance: కాంగ్రెస్ ఆప్ చెలిమి, ఐదు రాష్ట్రాల్లో పొడిచిన పొత్తు!
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని దింపాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ మొత్తానికి వ్యూహాలపై వ్యూహాలు వేస్తూ సాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ సహా 5 రాష్ట్రాల్లో ఆప్‌తో పొత్తుపెట్టుకుంది.
AAP Congress Alliance: కేంద్రంలోని నరేంద్ర మోడీ (Narendra modi) సర్కారును గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులపై అనేక తర్జనభర్జనల అనంతరం ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ (Aaam Aaadmi Party) జాతీయ కాంగ్రెస్ పార్టీ(Congress Party)తో చేతులు కలిపింది. ఢిల్లీ(Delhi), గోవా(Goa), గుజరాత్(Gujarat), హరియాణా(Haryana), ఛండీగడ్(chandighar)లోని పార్లమెంటు స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని రెండు పార్టీలూ నిర్ణయించాయి. "రాజకీయ ప్రాధాన్యాల కన్నా దేశ ప్రయోజనాలు మిన్న అని భావించాం. కాంగ్రెస్ పై నమ్మకంతోనే ఆ పార్టీతో చేతులు కలిపాం" అని ఆప్ పేర్కొనడం గమనార్హం. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఆప్ కొనసాగుతున్న విషయం తెలిసింది.
ఇవీ కుదిరిన పొత్తులు..
ఢిల్లీ(Delhi) సహా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ స్థానాల్లో ఆప్ పోటీ చేయనుంది. చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ సీట్లలో కాంగ్రెస్(Congress) పోటీలోకి దిగుతుంది. కాగా, ఈ ఏడు స్థానాల్లోనూ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకుంది, అంతేకాదు, గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ సాధించడం గమనార్హం, ఇక, గుజరాత్లోని మొత్తం 28 స్థానాల్లో రెండు చోట్ల (భారుచ్, భావ్ నగర్) ఆప్ పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. అదేవిధంగా గోవాలోని రెండు పార్లమెంటు స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. ఛండీగఢ్ లోని ఒకే ఒక స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే బరిలోకి దిగనున్నారు. అయితే, గోవాలోని దక్షిణ నియోజకవర్గం నుంచి ఆప్ ఇదివరకే తన అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే వెంజీ వేగాసు ప్రకటించింది. అయితే, ఆయనను పక్కకు తప్పించి కాం గ్రెస్ అభ్యర్థి ఫ్రాన్సిస్కో సర్దిన్హా ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు.
హరియాణాలో పరిస్థితి ఇదీ..
ప్రస్తుతం రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న.. హరియాణాలోని 10 స్థానాల్లో కాంగ్రెస్ 9 చోట్ల, ఆప్ ఒక స్థానం(కురుక్షేత్ర) నుంచి పోటీ చేయనున్నాయి. కీలకమైన పంజాబ్లో మాత్రం కాంగ్రెస్, ఆప్ ఎవరికి వారుగా పోటీ చేయనున్నారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం`` అని ఇరు పార్టీలూ ప్రకటించడం గమనార్హం.
అన్ని కోణాల్లోనూ..
ఇక, ఈ పొత్తుల వ్యవహారంపై అన్ని కోణాల్లోనూ ఆలోచించి, అందరినీ సంప్రదించిన తర్వాతే టికెట్లపై నిర్ణయం తీసు కున్నామని అటు ఆప్, ఇటు కాంగ్రెస్ పార్టీలు స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, ఆఫ్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఈ ఒప్పందాన్ని అనుసరించి పనిచేస్తారని భావిస్తున్నట్టు ఈ పార్టీలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ కురువృద్ధ కుటుంబానికి ఎసరే?
తాజాగా ఆప్‌తో కలిసి ఎన్నికలకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంకటం తెరమీదికి వచ్చింది. గుజరాత్ ని భారుచ్ స్థానాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ ఆశించారు. కానీ, ఈ సీటును ఆప్ అభ్యర్థికి ఇవ్వడంతో ఆయన భగ్గుమన్నారు. ఆప్‌కు సహకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తాన ని, నామినేషన్లను చాలా సమయం ఉండని, ఈలోగా ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు.
నాన్న సెంటిమెంటు..
'మా నాన్న(అహ్మద్ పటేల్) ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశారు. ఇది మా సీటు. ఈ పొత్తును నేను, నా మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే, పార్టీ ఏం చెప్పినా శిరసావహిస్తాం" అని అన్నారు. పటేల్ కుమార్తె ముంతాజ్ కూడా ఇదే చెప్పారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎక్స్ వేదికగా ఆమె విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కీలక సలహాదారుగా వ్యవహరించిన అహ్మద్ పటేల్ 1970-1980 మధ్య మూడు సార్లు భారుచ్ నుంచి విజయం సాధించారు. అయితే, ఆప్ నుంచి పోటీకి సిద్ధమైన వైతర్ వాసవ మాత్రం తాను ఇక్కడ నుంచి గెలిచి అహ్మద్ పటేలకు అంకితమిస్తానని వ్యాఖ్యానిస్తున్నారు.
అవకాశవాద పొత్తు: బీజేపీ
కాంగ్రెస్, ఆప్ పొత్తులపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ఆప్ చేతులు కలపడాన్ని 'అవకాశవాద పొత్తు'గా విమర్శించారు. "ఇదొక పనికిరాని కూటమి. ఢిల్లీలో చేతులు కలిపారు. పంజాబ్‌లో మాత్రం ఒకరిపై ఒకరు పోరాడుకుంటారట. ఇదొక వంకర రాజకీయం" అని ఎక్స్ పోస్టు చేశారు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్-ఆప్ మధ్య 'అవినీతి పొత్తు'' మా బాగా కుదిరిందని వ్యాఖ్యానించారు. ఈ పొత్తులో ఎలాంటి కెమిస్ట్రీ లేదన్నారు. లెక్కలు కూడా సరిపోవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాసేవలో తరిస్తున్న ప్రధాని మోడీపై ఈ పొత్తు ఎలాంటి ప్రభావం చూపిందని అన్నారు. 2004-14 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూఈఏ ప్రభుత్వంపై కేజీవాల్ చేసిన విమర్శలు మరిచిపోయారా? అప్పట్లో మంత్రులంతా అవినీతిలో కూరుకుపోయారని ఆయన దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీకి ఇచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి నేతతో ఇప్పుడు పొత్తులంటే హాస్యాస్పదంగా ఉంది. ఆ రెండు పార్టీలకూ సొంతగా పోటీ చేసే సత్తాలేదు" అని మీనాక్షి లేఖి విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ధీమా ఇదీ..
లోక్‌సభ ఎన్నికలలో పొత్తులకు సంబంధించి కొన్ని రోజుల్లోనే ఇండియా కూటమిలోని పార్టీల మధ్య చర్చలన్నీ సాను కూలంగా ముగుస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలతో చేతులు కలుపుతామని పేర్కొంది. ఇక, తమ కూటమి పార్టీల కారణంగా బీజేపీలో వణుకు పుడుతోందని వ్యాఖ్యానించడం గమనార్హం.