Telangana University: తెలంగాణ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా వాకాటి కరుణ నియామకం!
తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 14న) ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ విశ్వవిద్యాలయం(టీయూ)లో గత రెండేళ్ల కుంటుపడిన పరిపాలనను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 14న) ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత కాలం వీసీగా పనిచేసిన డాక్టర్ రవీందర్ గుప్తా, ఓ ప్రైవేటు కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ జూన్ 17న ఏసీబీకి పట్టుబడి, జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి వీసీ లేకపోవడంతో వర్సిటీలో కార్యకలాపాలు స్తంభించడం, ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త వీసీని నియమించే వరకూ ఆమె ఆ హోదాలో కొనసాగనున్నారు. అయితే దాదాపు నెల రోజులు జైల్లో ఉన్న రవీందర్ గుప్తా బెయిల్‌పై విడుదలైన రోజే వాకాటి కరుణను ఇంచార్జి వీసీగా నియమించడం గమనార్హం. టీయూ ఇన్‌చార్జి వీసీగా ఐఏఎస్ అధికారి నియమితులవ్వడం ఇది ఐదోసారి.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణను ఇన్‌చార్జి వీసీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో టీయూలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వీసీ రవీందర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా అవినీతి, అక్రమాలతో అరెస్టు కావడంతో ఆయనను సర్వీసుల నుంచి తప్పించింది. వీసీని అవినీతి కేసులో బాధ్యతల నుంచి తప్పించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. వాకాటి కరుణ నేతృత్వంలో పరిపాలనను చక్కబెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈసీ మీటింగ్‌లకు వీసీ హోదాలో రవీందర్‌గుప్తా డుమ్మా కొట్టిన సందర్భాల్లో వాకాటి కరుణ అధ్యక్షతన పాలకవర్గ సమావేశాలు జరిగాయి. టీయూలో జరిగిన ప్రతి అంశంపై విద్యా శాఖ కార్యదర్శిగా పూర్తిస్థాయిలో ఆమెకు అవగాహన ఉండడంతో కీలక బాధ్యతలను సర్కారు కట్టబెట్టింది.
టీయూకు వీసీలుగా ఉన్నది వీరే..
➥ టీయూకు తొలి వీసీగా సులేమాన్ సిద్ధిఖీ 3 నెలలపాటు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 4 నెలలు పాటుగా సులోచనారెడ్డి పనిచేశారు.
➥ ఆ తర్వాత శాశ్వత వీసీగా కాశీరామ్ 2006, నవంబర్ 6న బాధ్యతలు స్వీకరించి 2009 నవంబర్ 3 వరకు అత్యధిక కాలం పనిచేశారు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ఎన్.లింగమూర్తికి ఇన్‌చార్జిగా బాధ్యతలివ్వగా ఏడాదిపాటు పనిచేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తిరుపతి రావు ఇన్‌చార్జిగా 3 నెలలపాటు విధులు నిర్వహించారు. అనంతరం 6 నెలలు వి.గోపాల్‌రెడ్డి ఇన్‌చార్జిగానే విధులు నిర్వహించారు.
➥ అక్బర్ అలీఖాన్‌ను 2011, జూలై 15న ప్రభుత్వం వీసీగా నియమించగా 2014 జూలై 14 వరకు పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆరు నెలలపాటు ఐఏఎస్ శైలజా రామయ్యర్ పని చేసిన తర్వాత రెండేండ్ల పాటు ఐఏఎస్ పార్థసారథి సైతం ఇన్‌చార్జి వీసీగా విధుల్లో చేరారు.
➥ ప్రభుత్వం 2016, జూలై 25న పి.సాంబయ్యను వీసీగా నియమించింది. ఆయన 2019, జూలై 24న ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం ఐఏఎస్ అధికారుల వి.అనిల్ కుమార్ ఆరు నెలలు, నీతూ కుమారి ప్రసాద్ ఏడాదిన్నర కాలంపాటు పని చేసిన తర్వాత 2021, మే 22న రవీందర్ గుప్తాను ప్రభుత్వం వీసీగా నియమించింది.
➥ ఏసీబీ కేసుల నేపథ్యంలో ఆయనను బాధ్యతల నుంచి తప్పించడంతో తాజాగా ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 14 మంది వీసీలుగా నియమితులైతే ముగ్గురు రెగ్యులర్ ప్రాతిపదికన ఉన్నారు. మిగిలిన వారంతా ఇన్‌చార్జి వీసీలుగానే కొనసాగగా ఇందులో ఐదుగురు ఐఏఎస్ అధికారులున్నారు.