నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది.
నూతన విద్యావిధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆనర్స్ డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. నాలుగేళ్లు లేదా మూడేళ్లు.. ఆనర్స్ లో ఏ డిగ్రీ కోర్సును ఎంచుకోవాలనే చాయిస్ విద్యార్థులదేనని పేర్కొంది. కాగా, నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులకు మాత్రమే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.
దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసింది. వీటి ప్రకారం నాలుగేళ్ల కోర్సు తీసుకునే విద్యార్థులకు మాత్రమే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు. విద్యార్థులు అవసరమైతే రీసెర్చ్ స్పెషలైజేషన్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ విద్యార్థులకు కోర్సు నాలుగో ఏడాదిలో స్పెషలైజేషన్‌కు సంబంధించిన సిలబస్ ఉంటుంది. వీరికి రీసెర్చ్ స్పెషలైజేషన్‌తో ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు. అదేవిధంగా ఆనర్స్ డిగ్రీని ఎంచుకున్నవారు మొత్తం 160 క్రెడిట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల డిగ్రీని ఎంచుకునే విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే ఆనర్స్ డిగ్రీని పొందగలుగుతారు. అలాగే ఈ కోర్సుల్లో చేరినవారు ఏదైనా కారణంతో మూడేళ్లలోపు మానేస్తే, మళ్లీ కోర్సులో చేరే అవకాశం ఉంటుంది.
Also Read: జేఈఈలో ఇంటర్ మార్కుల నిబంధన, పాతవిధానం అమలు యోచనలో ఎన్టీఏ!
నాలుగేళ్ల కోర్సులో చేరి మూడేళ్ల లోపు మానేస్తే.. మూడేళ్లలోపు అదే కోర్సులో చేరే అవకాశం కల్పించినట్లు యూజీసీ తెలిపింది. మొత్తంగా ఏడేళ్లలోపు ఈ కొత్త కోర్సును పూర్తిచేయాలి. ఇందులో మేజర్, మైనర్ స్ట్రీమ్ కోర్సులుంటాయి. అలాగే లాంగ్వేజ్ కోర్సులు, స్కిల్ కోర్సులు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, అండర్‌స్టాండింగ్ ఇండియా, డిజిటల్ అండ్ టెక్నలాజికల్ సొల్యూషన్స్, హెల్త్ అండ్ వెల్‌నెస్, యోగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కోర్సులు ఎంచుకోవచ్చని యూజీసీ తెలిపింది.
నాలుగేళ్ల కోర్సు గురించి డిసెంబరు 12 నాటికి అధికారికంగా ప్రకటన చేస్తామని యూజీసీ ఛైర్మన్ ఆచార్య ఎం.జగదీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తానికి వచ్చే విద్యా సంవత్సరం (2023-24) సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఆనర్స్, ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీని ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు దీన్ని తప్పకుండా అమలు చేసే అవకాశం ఉంది.
Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇక ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఎంసెట్ కోచింగ్!
ముఖ్యమైన మార్పులు ఇవీ..
➥ నాలుగేళ్ల డిగ్రీలో 160 క్రెడిట్లు సాధిస్తే ఆనర్స్ డిగ్రీ పట్టా ఇస్తారు. ఒకవేళ మూడేళ్లలో 75 శాతం, ఆపై మార్కులు పొంది.. పరిశోధన చేయాలనుకుంటే వారు రీసెర్చ్ ప్రాజెక్టు పూర్తిచేయాలి. వారికి ఆనర్స్.
➥ ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీలో చేరిన వారు వారు నాలుగేళ్ల డిగ్రీకి అర్హులే. కాకపోతే ఆయా వర్సిటీలు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో బ్రిడ్జి కోర్సును అందించాలి.
➥ రెండో సెమిస్టర్ పూర్తయిన తర్వాత చదువు ఆపాలనుకుంటే యూజీ సర్టిఫికెట్, రెండేళ్ల తర్వాత అయితే యూజీ డిప్లొమా సర్టిఫికేషన్ ఇస్తారు.
కోర్సులవారీగా క్రెడిట్లు..
కోర్సు | మూడేళ్ల డిగ్రీ | నాలుగేళ్ల డిగ్రీ |
మేజర్ (కోర్) | 60 | 80 |
మైనర్ | 24 | 32 |
మల్టీ డిసిప్లినరీ | 09 | 09 |
ఎబిలిటీ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్సు | 08 | 08 |
స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్సు | 09 | 09 |
వ్యాల్యూ యాడెడ్ కోర్సు | 06-08 | 06-08 |
సమ్మర్ ఇంటర్న్‌షిప్ | 02-04 | 02-04 |
రీసెర్చ్ ప్రాజెక్ట్ | - | 12 |
మొత్తం | 120 | 160 |