(Source: ECI/ABP News/ABP Majha)
విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇక ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఎంసెట్ కోచింగ్!
ఉచిత ఎంసెట్ తరగతుల్లో ప్రతిభ చూపిన వారికి ఫిబ్రవరిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఏప్రిల్, మే నెలలో జరిగే 'ఇంటెన్సివ్ సమ్మర్ ఉచిత ఎంసెట్-2023 కోచింగ్'కు ఎంపిక చేస్తారు.
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త తెలిపింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్ కోచింగ్‌ను నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ ఆయా జిల్లా అధికారులు, కాలేజీల ప్రిన్సిపాల్స్, నోడల్ అధికారులకు ఈ మేరకు ఆదేశించారు.
ఉత్సాహవంతులైన విద్యార్థులను ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో గుర్తించి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్ తరగతులు నిర్వహించాలని నవీన్ మిత్తల్ అధికారులను కోరారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫిబ్రవరిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఏప్రిల్ మే నెలలో జరిగే 'ఇంటెన్సివ్ సమ్మర్ ఉచిత ఎంసెట్-2023 కోచింగ్'కు ఎంపిక చేయనున్నారు.
ప్రతి జిల్లా నుండి 50 మంది అమ్మాయిలు, 50 మంది అబ్బాయిలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు. అందుకు కావాల్సిన ఫ్యాకల్టీని కూడా ఎంపిక చేయాలని సూచించారు. ఈ అంశాలపై దృష్టి సారించి ప్రతి కాలేజీలో ఎంసెట్ తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
సమూలంగా మారనున్న బోర్డు స్వరూపం!
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఇంటర్మీడియేట్ విద్యలో గణనీయమైన మార్పులు తేవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
➔ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 20 శాతం మార్కులను ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నారు. రాత పరీక్షను 80 మార్కులకే పరిమితం చేయనున్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్‌ను అమలు చేయనున్నారు.
➔ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును ఈ విద్యా సంవత్సరమే అమలు చేయనున్నారు.
➔ ఎంపీసీ గ్రూపు రెండో ఏడాది గణితం- 2బిలో ఎక్కువ మంది విద్యార్థులు తప్పుతున్నారు. సిలబస్ అధికంగా, కఠినంగా ఉందనే భావన ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కొంత మేర సిలబస్ తగ్గిస్తారు. అందుకు ఓ కమిటీని నియమిస్తారు.
➔ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా నీట్, క్లాట్ తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సిలబస్ రూపొందిస్తారు.
➔ వచ్చే విద్యా సంవత్సరం(2023-24) ప్రథమ, 2024-25లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ద్వితీమ భాష సబ్జెక్టుల సిలబస్ మారుస్తారు. నైతికతను పెంచే పాఠాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
➔ ఇంటర్ బోర్డులో 52 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తారు. ఒక్కో చోట మూడు ఉద్యోగాల చొప్పున 15 జిల్లాల్లోని నోడల్ అధికారుల కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తారు.
➔ కామర్స్‌ను కామర్స్ అండ్ అకౌంటెన్సీగా పిలుస్తారు.
➔ అంధులు, మూగ, చెవిటి విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షల్లో సాధారణ విద్యార్థుల కంటే 30 నిమిషాల సమయం అధికంగా ఇచ్చేవారు. దాన్ని 60 నిమిషాలకు పెంచుతారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తారు.