TS EAPCET: 'టీఎస్ ఎప్‌సెట్-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న వెలువడనుంది.
TS EAPCET Notification 2024: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2024' షెడ్యూలు ఫిబ్రవరి 6న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 21న ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ-హైదరాబాద్ ఫిబ్రవరి 20న ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్యం రుసుంతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు, రూ.5000 ఆలస్య రుసుంతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకోవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు మే 1 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 9, 10 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాలకు; మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు ప్రవేశ పరీక్ష జరగనుంది. ఆయాతేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉన్నత విద్యామండలి ఇటీవలే ఎంసెట్ పేరును ఈఏపీసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జేఎన్టీయూ హైదరాబాద్‌కు పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించారు. సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ దీన్ కుమార్ నియమితులయ్యారు.
ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సం, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన 100 శాతం సిలబస్‌తో టీఎస్ ఎప్‌సెట్‌ను నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ – తెలుగు, ఇంగ్లిష్ – ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉండనుంది. తెలుగు లేదా ఉర్దూ వెర్షన్‌లోని ప్రశ్నల్లో తేడాలుంటే ఇంగ్లిష్ వెర్షన్‌నే ఫైనల్‌గా తీసుకుంటారు. ఇతర వివరాల కోసం 7416923578, 7416908215 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
ALSO READ:
TS ECET - 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైంది. ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.1000తో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 28 మధ్య దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 1 నుంచి సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జరగనుంది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్‌ను ఈసెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..