TS SSC Results: పదోతరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదు - ఫలితాల్లో నిర్మల్ టాప్, వికారాబాద్ లాస్ట్
TS SSC Results: తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలయ్యాయి. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణులయ్యారు.
Telangana 10th Class Results: తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నెంబరు లేదా హాల్‌టికెట్ వివరాలు నమోదుచేసి మార్కుల మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ ప్రవేశాల సమయంలో ఈ షార్ట్ మెమోలు ఉపయోగపడతాయి. ఒరిజినల్ మెమోలను త్వరలోనే సంబంధిత పాఠశాలలకు చేరవేయనున్నారు.
ఈసారి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 3927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది. సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలన్నీ ప్రైవేటు స్కూల్స్ కావడం గమనార్హం. ఫలితాల్లో 99.09 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 98.65 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా రెండోస్థానంలో, 98.27 శాతం ఉత్తీర్ణతతో సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక 65.10 ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది.
తెలంగాణ పదోతరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..
27 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించిన అధికారులు..
తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను మే 10న విడుదల చేశారు. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించారు. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 27 వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించనున్నారు.
జిల్లాలవారీగా ఫలితాల వివరాలు.. (TS SSC Results District wise Pass Percentage)
1. నిర్మల్- 99.05 %
2. సిద్దిపేట్ - 98.65 %
3. రాజన్న సిరిసిల్ల - 98.27 %
4. జనగామ - 98.16 %
5. సంగారెడ్డి - 97.86 %
6. సూర్యాపేట- 96.91 %
7. కరీంనగర్ - 96.65 %
8. పెద్దపల్లి - 96.32 %
9. నల్గొండ - 96.11 %
10. హనుమకొండ - 95.99 %
11. జగిత్యాల - 95.76 %
12. మహబూబాబాద్ - 94.62 %
13. ములుగు - 94.45 %
14. నిజామాబాద్ - 93.72 %
15. నారాయణ్ పేట్ - 93.13 %
16. జయశంకర్ భూపాలపల్లి - 92.96 %
17. ఆదిలాబాద్ - 92.93 %
18. మెదక్ - 92.90 %
19. కామారెడ్డి - 92.71 %
20. మంచిర్యాల - 92.42 %
21. ఖమ్మం - 92.24 %
22. వరంగల్- 92.20 %
23. నాగర్ కర్నూల్ - 91.57 %
24. రంగారెడ్డి - 91.01 %
25. యాదాద్రి భువనగిరి - 90.44 %
26. భద్రాద్రి కొత్తగూడెం - 90.39 %
27. మేడ్చల్ మల్కాజ్‌గిరి - 89.61 %
28. మహబూబ్‌నగర్ - 89.47 %
29. వనపర్తి - 86.93 %
30. హైదరాబాద్ - 86.76 %
31. కొమరం భీమ్ ఆసిఫాబాద్ - 83.29 %
32. జోగుళాంబ గద్వాల్ - 81.38 %
33. వికారాబాద్ - 65.10 %
రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియను అధికారులు చేపట్టారు. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 20తో ముగిసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫలితాలను డీకోడింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఫలితాలను అధికారులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులుకాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేశారు.
జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. అయితే ఫలితాల వెల్లడి సమయంలోనే పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను విద్యాశాఖ వెల్లడించింది. దీనిప్రకారం జూన్ 3 నుంచి 13 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.