TS EAPCET Counselling: టీఎస్ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే?
TS EAPCET 2024: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలో వెలువడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశ విధానాన్నే అమలుచేయనున్నారు.
TS EAPCET 2024 Counselling Schedule: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు (affiliation) జారీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నాటికి ఇంజినీరింగ్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభించాలని కళాశాలలకు ఏఐసీటీఈ స్పష్టం చేసిన నేపథ్యంలో.. గడువులోపు ప్రవేశాలు పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా యాజమాన్య(మేనేజ్‌మెంట్) కోటా సీట్లను ఇష్టారీతిన అమ్ముకోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీచేసే అవకాశం ఉంది. ఎంబీబీఎస్ సీట్ల మాదిరిగా మూడు (A, B, C) కేటగిరీలుగా విభజించి ఫీజులు నిర్ణయించడం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు చేస్తున్నారు.
ఆ విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్..
మరోవైపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో డిప్లొమా చదివి లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ లేదా బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేలా చూస్తామని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎప్‌సెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కొత్తగా ఎలాంటి దరఖాస్తులు ఆహ్వానించలేదని, అయినా కొందరు దరఖాస్తులు ఇస్తున్నారని, నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని తెలిపారు. గతేడాది అనుమతులు లేకుండా ప్రవేశాలు నిర్వహించిన రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను ఇతర విద్యాసంస్థల్లో సర్దుబాటు చేశామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.
మేనేజ్‌మెంట్ కోటాలోనూ కంప్యూటర్‌దే హవా..
యాజమాన్య కోటాలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సుకే అధిక డిమాండ్ ఉంది. కోర్ గ్రూప్‌లైనా సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంటేశం అన్నారు. ఇంజినీరింగ్ కోర్ గ్రూపుల్లో సీట్లు బాగానే మిగిలిపోతున్నాయని, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఎమర్జింగ్ కోర్సులు ఉన్నాయని, వాటిలోనూ విద్యార్థులు ప్రవేశాలు పొందాలని సూచించారు.
కొత్తగా ప్రైవేటు వర్సిటీలకు అనుమతి..
రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రమాణాలు పాటిస్తూ, నాణ్యమైన విద్యను అందించడానికి ముందుకొచ్చే ప్రైవేటు యూనివర్సిటీలకే ఏర్పాటుకు అనుమతిస్తామన్నారు. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు కొందరు ముందుకొస్తున్నారని, వారిని పరిగణలోకి తీసుకొంటామని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రవేశాలే..
ఎప్‌సెట్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మా కళాశాలల్లో తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ప్రస్తుతం కొనసాగుతున్న ఉమ్మడి ప్రవేశ విధానాన్నే అమలుచేయనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. జూన్ 2లోపే ఎప్‌సెట్ ఫలితాలు విడుదలైనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్ ఎప్‌సెట్-2024 పరీక్ష ఫలితాలు మే 18న విడుదలైన సంగతి తెలిసిందే. ఎప్‌సెట్ ఫలితాలకు సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలో 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించారు.