TS EAMCET: ఎంసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 15,447 సీట్లు ఖాళీనే!!
సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. తుది విడతలో కొత్తగా సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 28నాటికి కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబరు 25తో పూర్తయింది. కన్వీనర్ కోటాలో 79,346 బీటెక్ సీట్లకుగాను 63,899 మంది సీట్లు పొందారు. సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. అయితే సీట్లు పొందినవారిలో కళాశాలతో చేరే వారి సంఖ్య 55 వేలకు మించదని ఎంసెట్ ప్రవేశాల కమిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆ ప్రకారం చూస్తే కన్వీనర్ కోటాలోనే దాదాపు 24 వేల బీటెక్ సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని 16 ప్రభుత్వ కళాశాలల్లో ఈసారి మొత్తం 4,914 బీటెక్ సీట్లు ఉండగా వాటిల్లో 3771 మాత్రమే నిండాయి. 1143 (23శాతం) సీట్లు ఖాళీగానే ఉన్నాయి. సిరిసిల్ల జేఎన్‌టీయూహెచ్ కళాశాలలో టెక్స్‌టైల్ టెక్నాలజీలో ఎవరూ చేరలేదు. మెకానికల్‌లో ఇద్దరికే సీట్లు దక్కాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది.
కళాశాలల్లో చేరేందుకు 28 తుది గడువు..
చివరి విడతలో సీట్లు పొందిన విద్యార్థులతోపాటు గత రెండు విడతల్లో సీట్లు పొందిన వారు కూడా అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఒరిజినల్ టీసీతోపాటు ఇతర ధ్రువపత్రాలకు సంబంధించి జిరాక్స్ కాపీలు అందజేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ సమయంలోనే ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. స్పాట్ అడ్మిషన్లు, ప్రయివేటు అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను అక్టోబర్ 27న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు..
-> సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
-> కాలేజీలవారీగా ఇంజినీరింగ్ ఫీజుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫార్మసీ ఎంపీసీ స్ట్రీమ్‌లో 99 శాతం మిగులు…
రాష్ట్రంలో 171 కాలేజీల్లో 4025 ఫార్మసీ, ఫార్మ్-డి సీట్లు ఉన్నాయి. అయితే వీటిని ఎంపీసీ స్ట్రీమ్ వాళ్లతో నింపుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 60 (1.49 శాతం) సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఫార్మసీ విభాగంలో నాలుగు ప్రభుత్వ యూనవర్సిటీ కాలేజీల్లో 132 సీట్లకు 9 సీట్లు మాత్రమే ఇప్పటి వరకు నిండాయి. ఇంకా 123 సీట్లు భర్తీ కాలేదు. ఒక ప్రభుత్వ కాలేజీలోని 20 సీట్లకు 20 సీట్లు భర్తీ కాలేదు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజీలో 39 సీట్లల్లో ఒక్క సీటు కూడా నిండలేదు. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు 109 ఉండగా అందులో 3218 సీట్లకు 27 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తంగా ఫార్మసీ 109 కాలేజీల్లో 3409 సీట్లకు 36 సీట్లు (1.05 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి.
రాష్ట్రంలోని 56 కాలేజీల్లో ఫార్మ్-డి సీట్లు 616 ఉన్నాయి. అయితే వీటిలో ఇప్పటి వరకు 24 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 592 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో 12 సీట్లకు మూడు సీట్లు భర్తీ కాగా, 9 సీట్లు మిగిలే ఉన్నాయి. 55 ప్రైవేట్ కాలేజీల్లో 604 సీట్లకు 21 సీట్లు కేటాయించగా ఇంకా 583 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. మొత్తంగా ఫార్మసీ, ఫార్మ్-డి కాలేజీల్లోని 4025 సీట్లల్లో 60 సీట్లు (1.49శాతం) మాత్రమే భర్తీ కాగా ఇంకా 3965 సీట్లు మిగిలేఉన్నాయి.
సివిల్, మెకానికల్లో 32 శాతమే..
కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 93 శాతం సీట్లు నిండగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్‌ల్లో 76 శాతం సీట్లు నిండితే.. సివిల్, మెకానికల్ కోర్సుల్లో 32 శాతం సీట్లు మాత్రమే నిండాయి. ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ 44 శాతం సీట్లు నిండాయి. ఇంజనీరింగ్ కోర్సులకు తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీలోగా సీటు పొందిన కాలేజీల్లో చేరాలని అభ్యర్థులకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కాగా, కౌన్సెలింగ్‌లో 100 శాతం అడ్మిషన్లు నిండిన కాలేజీలు 28 ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రభుత్వ యూనివర్సిటీ కాగా, మరో 27 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి.
బ్రాంచీల వారీగా సీట్ల భర్తీ చూస్తే..
➥ సీఎస్‌ఈ, సంబంధిత బ్రాంచీల్లో మొత్తం 49,031 సీట్లుంటే 45,775 (93 %) భర్తీ అయ్యాయి. 3,256 సీట్లు భర్తీ కాలేదు. అత్యధికంగా సీఎస్‌ఈ (ఏఐ & ఎంఎల్)లో 1002 సీట్లు మిగిలిపోయాయి. ఇక సీఎస్ఈలో 704 సీట్లు మిగిలాయి.
➥ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో 18,825 సీట్లకు గాను 14,265 సీట్లు (76 %) భర్తీ అయ్యాయి. 4,560 సీట్లు మిగిలిపోయాయి.
➥ ఇక సివిల్, మెకానిక్, సంబంధిత బ్రాంచీల్లో మొత్తం 10,286 సీట్లలో 3,328 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 6,958 సీట్లు (68 శాతం) మిగిలిపోయాయి.
విద్యాసంస్థ | మొత్తం సీట్లు | కేటాయించిన సీట్లు | మిగిలిపోయిన సీట్లు |
ప్రభుత్వ కళాశాలలు - 16 | 4914 | 3771 (76.73 %) | 1143 |
ప్రైవేటు యూనిర్సిటీలు - 2 | 1478 | 1074 (72.66 %) | 404 |
ప్రైవేటు కళాశాలలు -159 | 72,954 | 59,054 (80.94) | 13,900 |
మొత్తం: 177 | 79,346 | 63,899 (80.53 %) | 15,447 |
:: ఇవీ చదవండి ::
విద్యార్థులకు గుడ్ న్యూస్, డిటెన్షన్ విధానంపై జేఎన్టీయూ కీలక నిర్ణయం!
జేఎన్‌టీయూ-హైదరాబాద్ విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త వినిపించింది. విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ విద్యార్థులను వచ్చే ఏడాదికి ప్రమోట్ చేయడానికి క్రెడిట్ ప్రమాణాలను సడలించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
DOST Counselling: 'దోస్త్' స్పెషల్ కౌన్సెలింగ్, డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం!
ఇంజినీరింగ్‌లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అక్టోబరు 25 నుంచి అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేయనున్నారు. ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..