Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Madhyapradesh News: రాజస్థాన్‌లో బోరుబావిలో చిన్నారి పడిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. 16 గంటలు శ్రమించినా పదేళ్ల బాలుని ప్రాణాలు దక్కలేదు.
10 Year Old Boy Fell Into Borewell In Madhyapradesh: బోరుబావులు చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీలో మూడేళ్ల చిన్నారి ఈ నెల 23న బోరుబావిలో పడిపోగా రక్షించేందుకు 7 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) గుణ జిల్లాలో (Guna District) శనివారం సాయంత్రం అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం 16 గంటలు శ్రమించినా బోరుబావిలో పడ్డ పదేళ్ల బాలుని ప్రాణాలు దక్కలేదు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుణ జిల్లాలోని పిప్లియా గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటలకు సుమిత్ మీనా అనే బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న 140 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు.
16 గంటలు శ్రమించినా..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావికి కొంతదూరంలో గొయ్యి తీసి 16 గంటలు శ్రమించిన అనంతరం బాలుడిని బయటకు తీశారు. అయితే, అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి చేరుకోగా.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 'బాలుడు రాత్రంతా చల్లటి వాతావరణంలో ఉండడంతో చేతులు, కాళ్లు తడిచి వాచిపోయాయి. కోర్ బాడి టెంపరేచర్ 95 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువగా పడిపోయినప్పుడు ఏర్పడే స్థితి కారణంగా బాలుని శరీర భాగాలు స్తంభించిపోయాయి. మెరుగైన వైద్యం అందించినా సమయం మించిపోయినందున బాలుడిని కాపాడుకోలేకపోయాం.' అని గుణ జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు.
7 రోజులుగా బోరుబావిలోనే..
మరోవైపు, రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ - బెహ్రర్ జిల్లాలో చేతన అనే చిన్నారి ఈ నెల 23న తండ్రి పొలంలో ఆడుకుంటూ 700 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. చిన్నారిని రక్షించేందుకు గత 7 రోజులుగా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది. తొలుత పాపను రక్షించేందుకు కుటుంబ సభ్యులు యత్నించగా మరింత కిందకు జారుకుంది. ఈ క్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీస్ సిబ్బంది పాపను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. చిన్నారి 150 అడుగుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. పైపుతో ఆక్సిజన్‌ను లోపలికి పంపిస్తున్నారు. క్లిప్స్ సాయంతో చిన్నారిని 30 అడుగులు పైకి లాగినట్లు అధికారులు వెల్లడించారు. గత 6 రోజులుగా చిన్నారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, ర్యాట్ హోల్ మైనర్స్ సాయంతో చిన్నారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చిన్నారి పడిపోయిన బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వడంపై దృష్టి సారించారు.
మాతృమూర్తి ఆవేదన..
తమ చిన్నారి గత 7 రోజులుగా తీవ్ర వేదన అనుభవించడంపై పాప తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. చీకటిలో చిక్కుకుని, ఆకలి, దప్పికతో ఎన్ని బాధలు పడుతుందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. త్వరగా తన కుమార్తెను బయటకు తీయాలంటూ అధికారులను వేడుకుంటోంది.
Also Read: PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే