New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Telangana News: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. గతంలో వివాదాల కారణంగా కొన్ని పబ్బులకు అనుమతి ఇవ్వలేదు.
Hyderabad Police Restrictions On Pubs Due To New Year Celebrations: మరో 2 రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ క్రమంలో భాగ్యనగరంలో (Hyderabad) న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు అంతా సిద్ధమవుతున్నారు. వేడుకల సందర్భంగా నగర పోలీసులు సైతం పటిష్ట చర్యలు చేపట్టారు. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటీ, మాధాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు. మైనర్లను బార్లు, పబ్‌లకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వేడుకల సమయంలో సౌండ్ పొల్యూషన్ లేకుండా చూడాలని సౌండ్ ప్రూఫ్ మెయింటైన్ చేయాలని పబ్ యజమానులను ఆదేశించారు.
అటు, జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్‌ల్లో జరిగిన గొడవలు, పోలీస్ కేసుల కారణంగా ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించుకోవాలని తెలిపారు. మద్యం సేవించిన కస్టమర్లు వాహనాలు నడపడానికి అనుమతించకూడదని.. నిబంధనలు పాటించకుంటే సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
మరోవైపు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి దాటాక ఓఆర్ఆర్‌తో పాటు అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్శిటీ ఫ్లైఓవర్లు, షేక్ పేట్, మైండ్ స్పేస్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్ JNTU ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్‌ను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ మూసివేయనున్నారు.
క్యాబ్స్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు ఆంక్షలు
క్యాబ్‌లు, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. క్యాబ్ డ్రైవర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ రైడ్ రిజెక్ట్ చెయ్యొద్దని.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా రైడ్ రిజెక్ట్ చేస్తే వాహనం నెంబర్, టైం, ప్రదేశం వంటి వివరాలతో వాట్సాప్ నెంబరు 9490617346 కు ఫిర్యాదు చెయ్యొచ్చని సూచించారు. ప్రజలతో మర్యాదగా మసులుకోవాలని.. అదనపు ఛార్జీలు డిమాండ్ చేయకూడదని స్పష్టం చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని.. సరైన పత్రాలు లేకుంటే వాహనాలు స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించొద్దని, మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. వాహనాల్లో అధిక డెసిబెల్స్, మ్యూజిక్ సిస్టమ్‌లను ఉపయోగించడం నిషేధమని.. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని అన్నారు. మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపైనా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు.