Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల పేరుతో హద్దులు దాటితే తాట తీసేందుకు సిద్దమైయ్యారు ఖాకీలు. ఈసారి ఆపరేషన్ చబూతర్ పేరుతో సరికొత్తగా డిసెంబర్ 31వ తేది అష్టదిగ్భంధం చేసేందుకు సిద్దమైయ్యారు.

Hyderabad Latest News: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏడాదంతా ఒకెత్తైతే, డిసెంబర్ 31వ తేదీ రాత్రి పరిస్ధితి పూర్తిగా విభిన్నం. హద్దులు దాటిన ఆకతాయిల వెకిలి చేష్టలు, డ్రగ్స్ మత్తు తలకెక్కి మృగాలుగా మారిన చేసే ఆగడాలు, పీకల దాకా తాగి , మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే మందుబాబుల ఓవర్ యాక్షన్.. ఇలా ఆ రాత్రి నూతన సంవత్సర వేడుకలు ఓవైపు, అంతే స్టాయిలో ఎంతో మంది అమాయకుల జీవితాల్లో విషాన్ని నింపే చీకట్లు మరో వైపు. ఈ పరిస్ధితి ప్రతీ ఏడాది సర్వసాధారణమైనప్పటికీ , సాధ్యమైనంత వరకూ ప్రమాదాలు జరగకుండా, క్రైమ్ అదుపు చేసేందుకు పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈసారి డిసెంబర్ 31వ తేదీ ఆకతాయిల ఆట కట్టించేందుకు ఆపరేషన్ చబూతర్ పేరుతో రంగంలోకి దిగారు హైదరాబాద్ పోలీసులు..
ఏంటీ ఆపరేషన్ చబూతర్?
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది పోలీసులు వినూత్నంగా చేపట్టిన ఆపరేషన్ చబూతర్ అనేది న్యూ ఇయర్ వేడుకల పేరుతో జరిగే ఆగడాలను, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను, నిబంధనలను ఉల్లంఘించి , అమాయకుల ప్రాణాలను తీసే సరదాలను అడ్డుకోవడం. ఈ ఆపరేషన్ చబూతర్ లక్ష్యం న్యూ ఇయర్ వేడుకల్లో క్రైమ్ సాధ్యమైనంత వరకూ కట్టడి చేయడం. ఒక్కమాటలో చెప్పాలంటే మీ వేడుకలు, ఇతర కుటుంబంలో విషాదాన్ని నింపకుండా చట్టపరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడమే ఈ ఆపరేషన్ చబూతర్ లక్ష్యం.
చబూతర్ పేరుతో డిసెంబర్ 31వ తేది ఏం జరుగబోతోంది
డిసెంబర్ 31వ తేదీ టార్గెట్ గా వారం రోజుల ముందు నుంచే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆపరేషన్ చబూతర్ ను షురూ చేశారు పోలీసులు. అస్సలు కథ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. 31వ తేదీన సరదాల పేరుతో గీత దాటొద్దంటూ ముందు నుంచే నగర ప్రజలను అప్రమత్తం చేసారు పోలీసు ఉన్నతాధికారులు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఏకంగా నగరంలో 100కుపైగా ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించబోతున్నారు. ఆరోజు రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3గంటల వరకూ నాన్ స్టాప్ గా నగరవ్యాప్తంగా 126 ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగనున్నాయి. ఈ తనిఖీలలో మద్యం సేవించి పట్టుబడితే ఈసారి ఏకంగా 6 నెలలు జైలు జీవితం , డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ గా 10వేలు ఫైన్ వేయడం తప్పదంటున్నారు. ఇలా నగరంలో తప్పతాగి ప్రాణాలు తీసే వాహనదారులకు డిసెంబర్ 31వ తేది చుక్కలు చూపించనున్నారు పోలీసులు. న్యూయర్ రోజు ఫ్యామిలితో ఉంటారా లేక తప్పతాగి వాహనం నడిపి జైల్లో ఉంటారా మీరే తేల్చుకోండంటూ , మందుబాబుకు ఓపెన్ చాలెంజ్ విసిరారు.
పార్టీ అంటే డ్రగ్స్ , డ్రగ్స్ ఉంటేనే పార్టీలో మజా అనేంతలా హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. అందులో న్యూ ఇయర్ పార్టీలంటే చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. టెలిగ్రామ్, వాట్సాప్ లలో కోవర్టు గ్రూపులలో డీల్స్ ఫిక్స్ చేస్తున్న ముఠాలను టార్గెట్ చేశారు. మత్తు పదార్ధాలను సరఫరా చేస్తున్న కేటుగాళ్లలోను జల్లెడ పట్టేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈగల్, టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఎప్పటికప్పుడు మత్తుగాళ్లను ట్రాక్ చేసేందుకు పక్కా వ్యూహాలను సిద్దం చేశారు. నగర సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మురం చేయడంతోపాటు గంజాయి సరఫరాను కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి.
ఇప్పటికే పబ్ లో పార్టీల పేరుతో మత్తు పదార్ధాలు సరఫరా, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తాట తీస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి 1గంట తరువాత బార్ లు ఓపెన్ లో ఉంటే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. ఇలా ఈ డిసెంబర్ 31వ తేది రాత్రి స్పెషల్ ఆపరేషన్ చబూతర్ పేరుతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ , ఆకతాయిల బెండు తీసేందుకు సిద్దమయ్యారు.





















