Kasturba Gandhi School: 300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
Kasturba Gandhi School KGBV | నిర్మల్ కస్తూర్భా గాంధీ స్కూల్ విద్యార్థినులను తల్లిదండ్రులు వచ్చి సిబ్బందితో గొడవ పడీ మరి ఇంటికి తీసుకెళ్తున్నారు. సమస్యను ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు.
Kasturba Gandhi Balika Vidyalaya | నిర్మల్: తెలంగాణలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆందోళన కొనసాగుతోంది. కస్తూర్బా విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది సమ్మె చేయడంతో అక్కడ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఓవైపు క్లాసులు జరగక, సరైన భోజనం అందక సారంగాపూర్ మండలం జామ్ కేజీబీవీ నుంచి సుమారు 90 మంది విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి పోయారు. ఈ విషయం బయటకు తెలియడంతో శనివారం చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లడానికి తరలివచ్చారు.
ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు
కస్తూర్భా స్కూల్ ఇంఛార్జ్‌గా ఉన్న ఎంఈఓ మధుసూదన్ తో విద్యార్థుల తల్లిదండ్రులుు మాట్లాడారు. శనివారం సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. తరగతులు జరగడం లేదని, సరైన భోజనం అందించడం లేదని విద్యార్థినులు అక్కడే ఉన్న తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఈ క్రమంలో వారు ఆందోళనకు దిగారు. ఉడికీ ఉడకని ఆహారాన్ని, నాణ్యత లేని అందిస్తూ తమ పిల్లల ఆరోగ్యాన్ని చెడగొడుతారా.. వారి ప్రాణాల మీదకు తెస్తారా అని ప్రశ్నించారు.
కేజిబివి పాఠశాలల్లో ఆందోళన
నిర్వాహణ సరిగ్గా లేని చోట తమ పిల్లలు మాత్రం ఎందుకంటూ విద్యార్థులను తల్లిదండ్రులు తమతో తీసుకెళ్తామన్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు వారి కోరిక మేరకు సుమారు 215 మంది విద్యార్థినులను తల్లిదండ్రుల వెంట పంపినట్లు ఎంఈవో తెలిపారు. శుక్రవారం, శనివారాల్లో మొత్తం 305 మంది విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 50 మంది వరకు ఉన్నారు. సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ ఎప్పటికప్పుడు కస్తూర్భా స్కూల్, హాస్టల్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.. సిబ్బందిని ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు.
రాత్రిపూట వెళ్లి సిబ్బందిని ప్రశ్నించిన డీఈఓ
పెద్ద సంఖ్యలో విద్యార్థినులు తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లారని తెలుసుకున్న డీఈఓ రామారావు శనివారం రాత్రి 9 గంటలకు సారంగాపూర్ మండలం జామ్ కేజీబీవీని సందర్శించారు. అక్కడి సమస్యలపై సిబ్బందిని ఆరా తీశారు. ఇంత మంది విద్యార్థినులను ఎందుకు ఇళ్లకు పంపాల్సి వచ్చిందని ఎంఈవోను ప్రశ్నించారు. బోధనేతర సిబ్బందితో డీఈవో సమావేశమై విధుల్లో చేరాలని సూచించడంతో వారు తిరిగి విధుల్లో చేరారు. ఆయన వెంట డిసీడీవో సలోమి కరుణ, పర్యవేక్షకుడు వెంకటరమణ ఉన్నారు.
కేజీబీవీల్లో బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెతో విద్యార్థులకు ఓవైపు క్లాసులు జరగడం లేదని, మరోవైపు నాణ్యమైన భోజనం అందించడం లేదని, పిల్లలను ఇంటికి పంపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లోని కస్తూర్భా విద్యాలయంలో టిఫిన్‌లో బొద్దింక వచ్చిందని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారుు. వారు ఎంఈఓ శంకర్ ను ప్రశ్నించారు. బొద్దింక రావడం అవాస్తవమని, నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు.
అల్పాహారంలో బొద్దింక, కాదు అంటున్న సిబ్బంది
ఆరో తరగతి విద్యార్థిని పళ్లెంలో బొద్దింక వచ్చిందని, ఎంఈవో దృష్టికి తీసుకెళ్లడంతో వండిన ఆల్పహారాన్ని పారవేయించారని తెలిపారు. తల్లిదండ్రుల ఆందోళన చేస్తున్నట్లు తెలుసుకున్న స్ధానిక తహసీల్దార్ స్వాతి, ఎంపీవో గోవర్ధన్, ఈవో చంద్రశేఖర్ స్కూలుకు వెళ్లి కిచెన్‌ను పరిశీలించారు. విద్యార్థులను ఇంటికి పంపించాలని తల్లిదండ్రులు పట్టుబట్టారు. మొత్తం 380 మందికి ఇప్పటికే వివిధ కారణాలతో 120 మంది ఇళ్లకు వెళ్లారు. శనివారం 280 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనారోగ్యంగా ఉన్న 50 మందిని ఇళ్లకు పంపించారు. దీంతో జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో విద్యా బోధన, హాస్టల్లో వసతిపై గందరగోళం నెలకొంది.