(Source: ECI/ABP News/ABP Majha)
నేడు తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారు!
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల భర్తీకి శనివారం(మే 27) కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారుకానుంది. ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయనున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల భర్తీకి శనివారం(మే 27) కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారుకానుంది. ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం మే 27న రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ఛైర్మన్ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఇతర సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయనున్నారు. డిగ్రీలో ప్రవేశాలకు 'దోస్త్' రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 16న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. మొత్తానికి ఎంసెట్ కౌన్సెలింగ్ జూన్ 3 లేదా 4వ వారంలో మొదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు.. దేశవ్యాప్తంగా జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహించనున్నారు. జూన్ 18న ఫలితాలు వెలువడుతాయి. ఇక ఆ మరుసటి రోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
జోసా కౌన్సెలింగ్ అయిదు లేదా ఆరు రౌండ్లు ముగియడానికి 35 రోజుల సమయం పడుతుంది. అంటే జులై 25న నాటికి చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత కూడా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు ఖాళీ ఉంటే వాటి భర్తీకి సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(సీశాబ్) రెండు విడతల ప్రత్యేక కౌన్సెలింగ్ జరుపుతారు. అందుకు మరో అయిదారు రోజులు పడుతుంది. మొత్తానికి జులై నెలాఖరు అవుతుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు వచ్చినవారు వాటిల్లో చేరతారు. ఆ వెంటనే ఎంసెట్ చివరి విడత జరిపితే రాష్ట్ర కళాశాలల్లో ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసుకోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Also Read:
టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
పౌరసేవల్లో వినూత్నంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వైద్యరంగానికి సైతం సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా తార్నకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు మే 26 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ కోరారు. ఇంటర్ బైపీసీలో ఉతీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
బాసర ట్రిపుల్ ఐటీ షెడ్యూల్ విడుదల, జూన్ 5 నుంచి దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలు విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ బుధవారం (మే 24) షెడ్యూలును ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 1న నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్ కేటగిరీ కింద పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ తదితర విద్యార్థులు జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 26న మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. జులై 1న ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..