TG CPGET: సీపీగెట్-2024 దరఖాస్తుకు జూన్ 17తో ముగియనున్న గడువు, జరిమానాతో చివరితేది వివరాలివే
CPGET 2024: తెలంగాణలో యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీతోపాటు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీగెట్‌కు అపరాధరుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు జూన్ 17తో ముగియనుంది.
CPGET 2024 Application: తెలంగాణలో వివిధ పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన సీపీగెట్-2024 దరఖాస్తు ప్రక్రియ జూన్ 17తో ముగియనుంది. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుములేకుండా జూన్ 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే రూ.500 ఆలస్యరుసుముతో జూన్ 25 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఒకటికి మించి సబ్జెక్టులకు దరఖాస్తుకునే అన్ని కేటగిరీలవారు అదనంగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 15 నాటికి 52 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కెమిస్ట్రీ, జువాలజీ, కామర్స్ కోర్సులకు ఒక్కో దానికి నాలుగు వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు కన్వీనర్ ఆచార్య పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండానే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణలో పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CPGET)-2024’ నోటిఫికేషన్ మే 15న విడుదలైన సంగతి తెలిసిందే. సీపీగెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 18న ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి జూన్ 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 5 నుంచి సీపీగెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సీపీగెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు.
సీపీగెట్ పరిధిలోని 294 కళాశాలల ద్వారా మొత్తం 51 పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 47 పీజీ కోర్సులు, 5 ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ(OU)తోపాటు.. కాకతీయ యూనివర్సిటీ(KU), పాలమూరు యూనివర్సిటీ (PU), మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU), శాతవాహన యూనివర్సిటీ (SU), తెలంగాణ యూనివర్సిటీ(TU), జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ(JNTUH), తెలంగాణ మహిళా వర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.
రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. పీజీ సెట్ రాయాలనుకునే వారు తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కుల ధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి.
పరీక్ష వివరాలు..
* సీపీగెట్ (CPGET) - 2024
ప్రవేశాలు కల్పించే కోర్సులు..
➥ ఎంఏ (MA)
➥ ఎంఎల్ఐఎస్సీ (MLISC)
➥ ఎంఎస్‌డబ్ల్యూ (MSW)
➥ ఎంహెచ్ఆర్‌ఎం (MHRM)
➥ ఎంటీఎం (MTM)
➥ ఎంకామ్ (MCom)
➥ ఎంఈడీ (MEd)
➥ ఎంపీఈడీ (MPEd)
➥ ఎంఎస్సీ (MSc)
➥ ఎంబీఏ (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్)
అర్హత: సీపీగెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఒకటికి మించి సబ్జెక్టులకు దరఖాస్తుకునే అన్ని కేటగిరీలవారు అదనంగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు సీపీగెట్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
➥ సీపీగెట్-2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.05.2024.
➥ సీపీగెట్-2024 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.06.2024.
➥ రూ.500 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.06.2024.
➥ రూ.2000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.06.2024.
➥ సీపీగెట్-2024 పరీక్షలు ప్రారంభం: 05.07.2024 నుంచి.
Check Application Fee Payment Status