Nita Ambani: కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025 గ్రహీత నీతా అంబానీ- గిరిజన విద్యార్థులకు స్ఫూర్తిదాయక పిలుపు
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025 అందుకున్నారు. విద్యా, వైద్య, సామాజిక సాధికారత రంగాల్లో చేస్తున్న అద్భుత కృషికి ఈ గుర్తింపు లభించింది.

KISS Humanitarian Award 2025 : రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ విద్యా, వైద్య, సామాజిక సాధికారత రంగాల్లో చేస్తున్న అద్భుత కృషికి గుర్తింపుగా కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025 అందుకున్నారు. ఆదివారం భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS) ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. సమానత్వం, ఆశయం, పట్టుదల వంటి సందేశాలతో గిరిజన విద్యార్థుల్లో ఆమె స్ఫూర్తి నింపారు.
విద్యా వ్యాప్తి, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ పరివర్తన, మహిళా సాధికారత, క్రీడా వికాసం వంటి అంశాల్లో ఆమె విస్తృతంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ పురస్కారం కొనియాడింది. శ్రీలంకకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మోహన్ మునసింఘే చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో కిట్ (KIIT), కిస్, కిమ్స్ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సమంత పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవీయ విలువల కోసం విశేషంగా శ్రమించే వ్యక్తులు, సంస్థలను గౌరవించేందుకు 2008లో ఈ అవార్డును నెలకొల్పారు. పురస్కార గ్రహీతకు ఒక ప్రశంసా పత్రం, బంగారు పూత పూసిన ట్రోఫీ అందజేస్తారు. గతంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా, ఆధ్యాత్మిక గురువు దలైలామా, మారిషస్ మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు ఈ గౌరవాన్ని పొందారు.
సమానత్వం, ఆశయాలపై విద్యార్థులకు దిశానిర్దేశం
ఈ వేడుకలో వేలాది మంది గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన నీతా అంబానీ లింగ సమానత్వం, ఉన్నత లక్ష్యాల గురించి మాట్లాడారు. మన కుమారులు చేయగలిగే ఏ పనైనా మన కుమార్తెలు కూడా చేయగలరు. వారి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను దాటి ఆలోచించాలని కోరుతూ.. ఈ రోజు మీరు ఉన్న స్థితి మీ ప్రారంభం మాత్రమే, గమ్యం కాదు. మీ కలలు, కష్టం, సాగిపోయే ధైర్యమే మీరు ఎంత దూరం వెళ్తారో నిర్ణయిస్తాయి అని హితవు పలికారు. దేశ పురోగతిపై పూర్తి విశ్వాసం వ్యక్తంచేస్తూ.. భారత దేశ భవిష్యత్తు అత్యంత ఉజ్వలంగా ఉండబోతోందని స్పష్టం చేశారు. విద్యార్థుల నేపథ్యంతో సంబంధం లేకుండా వారు ఆత్మవిశ్వాసంతో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
గిరిజన యువత సాధికారతలో కిస్ పాత్ర
ప్రపంచవ్యాప్తంగా గిరిజన విద్య కోసం అంకితమైన అతిపెద్ద సంస్థల్లో కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS) ఒకటి. కిండర్ గార్టెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు సుమారు 80,000 మంది విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, సమగ్ర అభివృద్ధి అవకాశాలను ఈ సంస్థ కల్పిస్తోంది. అణగారిన వర్గాల సాధికారతకు ఒక నమూనాగా నిలుస్తూ వ్యవస్థీకృత అభ్యాసం, మద్దతు ద్వారా వారిని ముందుకు నడిపిస్తోంది.
నీతా అంబానీకి దక్కిన ఈ గుర్తింపు దాతృత్వానికి, క్షేత్రస్థాయి మార్పునకు ఉన్న అనుసంధానాన్ని చాటిచెప్పింది. సుమారు 40,000 మంది విద్యార్థుల సమక్షంలో జరిగిన ఆమె ప్రసంగం.. సమ్మిళిత వృద్ధిలో ఆశయాలు, పట్టుదల ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో పునరుద్ఘాటించింది.























