(Source: ECI/ABP News/ABP Majha)
TG PGECET 2024: తెలంగాణ పీజీఈసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే
TG PGECET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్ 18న విడుదల చేసారు. అభ్యర్థులు పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Telangana PGECET 2024 Results: తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG PGECET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 18న సాయంత్రం 4 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ-హైదరాబాద్ హెచ్‌గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు పొందవచ్చు.
TG PGECET-2024 ర్యాంక్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి...
➥ పీజీఈసెట్ ర్యాంకు కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://pgecet.tsche.ac.in/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Rank Card' అనే లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ వివరాలు నమోదుచేయగానే ఐసెట్ ర్యాంక్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తుంది.
➥ అభ్యర్థులు ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
పీజీఈసెట్-2024 ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి..
ఈ ఏడాది పీజీఈసెట్ పరీక్షను జేఎన్‌టీయూ హైదరాబాద్ జూన్ 10 నుంచి జూన్ 13 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, వరంగల్‌లోని పలు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12,532 మంది అమ్మాయిలు కాగా.. 10,180 మంది అబ్బాయిలు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 20,626 (90.82%) మంది పరీక్షలకు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్ 18న విడుదల చేయనున్నారు.
జేఎన్‌టీయూ హైదరాబాద్ 'TS PGECET-2024' నోటిఫికేషన్‌ను మార్చి 12న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థుల ద్వారా మార్చి 16 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇక ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మే 28న హాల్‌టికెట్లు విడుదల చేసి.. జూన్ 10 నుంచి 13 వరకు టీఎస్‌పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించింది.
ఏ రోజు ఏ పరీక్ష నిర్వహించారంటే..?
➥ జూన్ 10: జియో ఇంజినీరింగ్ అండ్ జియోఇన్‌ఫర్మాటిక్స్, ఫార్మసీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.
➥ జూన్ 11: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ.
➥ జూన్ 12: ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, మెటలర్జిక్ ఇంజినీరింగ్.
➥ జూన్ 13: ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, నానోటెక్నాలజీ.
అర్హత మార్కులు ఇలా..
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.