Tribal University: గిరిజన యూనివర్సిటీలో ఈ ఏడాది నుంచే తరగతులు, సీయూఈటీ ద్వారా ప్రవేశాలు
తెలంగాణలో ప్రతిష్ఠాత్మక సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Tribal University In Telangana: తెలంగాణలో ప్రతిష్ఠాత్మక సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట కొన్ని కోర్సులతో మొదలుపెట్టి, ఆ తర్వాత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ములుగు జిల్లాలో పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులోకి వచ్చే వరకు ఈ యూనివర్సిటీకి హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ మార్గదర్శిగా వ్యవహరించనుంది. తరగతులు ప్రారంభించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ములుగు జిల్లా ఏటూరునాగారంలోని యువజన శిక్షణ కేంద్రం (వైటీసీ) భవనాన్ని యూనివర్సిటీకి అప్పగించింది.
సీయూఈటీ ద్వారా ప్రవేశాలు..
గిరిజన యూనివర్సిటీని రెండు దశల్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం యూజీసీ ద్వారా రూ.889 కోట్లు ఖర్చుచేయనుంది. కేంద్రీయ యూనివర్సిటీల ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) ద్వారా ప్రవేశాలు జరగనున్నాయి. కోర్సులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. దేశంలోని ఇతర గిరిజన యూనివర్సిటీల తరహాలో తెలంగాణ గిరిజన వర్సిటీలోనూ డిగ్రీ, పీజీ, పరిశోధన కోర్సులు, ప్రవేశాలు, రిజర్వేషన్లు అమలవుతాయని సంక్షేమాధికారులు చెబుతున్నారు.
169.35 ఎకరాల బదిలీ..
సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన వర్సిటీ కోసం తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ 169.35 ఎకరాల భూమిని గుర్తించి ఏటూరునాగారం ఐటీడీఏకి బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని, ఇక నుంచి యూనివర్సిటీ నిర్వహణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందని ఒక అధికారి వెల్లడించారు.
హెచ్‌సీయూ స్థాయిలో తెలంగాణ గిరిజన యూనివర్సిటీ..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని ఏర్పాటుకు కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం మొదటి విడతగా.. రూ.899 కోట్లను మంజూరు చేసింది. గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాలు పూర్తయ్యే దాకా వరంగల్ పట్టణంలో భవనాలను అద్దెకు తీసుకుని పాలనా వ్యవహారాలను నిర్వహించాలని కేంద్ర విద్యా శాఖ నిర్ణయించింది. మొదట ఐదారు కోర్సులతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఈ వర్సిటీకి వెంటనే ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ)ని నియమించడంతో పాటు అవసరమైన సిబ్బందిని విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చేర్చుకునే సంప్రదాయం ఉన్నందున వారికి ఉపయుక్తమయ్యే కోర్సులను గుర్తించి వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని వెంటనే పనులను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.
పరిశోధనలకు పెద్దపీఠ
తెలంగాణాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీలో పెద్ద ఎత్తున పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. గిరిజన అక్షరాస్యత పెంపు దిశగా చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో లంబాడీలు, ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నందున.. మైదాన ప్రాంతంలో ఉన్న ఈ తెగలు బాగానే రాణిస్తున్నా.. నల్లమల అటవీ ప్రాంతంలో జనాలకు దూరంగా ఉంటూ అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న చెంచులు, సుగాలీలు, కొండ కాపులు; తదితర సామజిక వర్గాలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. వారిని అన్ని రంగాల్లో వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా పరిశోధనలు జరగాలని.. ఇందుకోసం విరివిగా నిధులను కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.