అగ్రి బిజినెస్ పీజీ డిప్లొమా కోర్సులో పెరిగిన సీట్ల సంఖ్య, కేంద్ర మంత్రి వెల్లడి
వ్యవసాయ రంగంవైపు యువతను ఆకట్టుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా వసతిగృహాల్లో ఉండాలనే నిబంధనను కూడా తొలగిస్తున్నామన్నారు.
రాజస్థాన్‌లోని జైపూర్ కేంద్రంగా నిర్వహిస్తున్న చౌధరీ చరణ్ సింగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (ఎన్‌ఐఏఎం)లోని అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ డిప్లొమా కోర్సులో కేంద్ర ప్రభుత్వం మరో 60 సీట్లను పెంచింది. వ్యవసాయ రంగంవైపు యువతను ఆకట్టుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా వసతిగృహాల్లో ఉండాలనే నిబంధనను కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఫిబ్రవరి 19న జైపుర్‌లో జరిగిన ఎన్‌ఐఏఎం నాలుగో స్నాతకోత్సవంలో తోమర్ మాట్లాడారు. ఈ విద్యాసంస్థలో అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ డిప్లొమా కోర్సు సీట్లు ప్రస్తుతం 60 ఉండగా, ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. విద్యార్థులు, యువత వ్యవసాయంతో మమేకమైతే సాగు లాభదాయకంగా మారి, గ్రామాలు ప్రగతిపథంలో పయనిస్తాయని తోమర్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పీజీ డిప్లొమా సర్టిఫికేట్లు, ప్రతిభావంతులకు పతకాలను కేంద్ర వ్యవసాయ మంత్రి అందజేశారు.
Also Read:
నీట్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి: సుప్రీంకోర్టుకు తమిళనాడు
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)పై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశంలో వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఏకైక ప్రవేశమార్గం నీట్ అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం, ప్రాథమిక సమానత్వ హక్కును ఉల్లంఘించడం, ఫెడరలిజం సూత్రాలను విస్మరించడంగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం వేసిన ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. 'నీట్‌లో సాధించిన మార్కులే అన్ని వైద్య, అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికం అని చెప్పడం భారత రాజ్యాంగంలోని నిబంధనలు, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఏకపక్షంగా ఉల్లంఘించడమే' అని సుప్రీంకోర్టు ప్రకటించాలని పిటిషన్‌లో తమిళనాడు ప్రభుత్వం కోరింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్స్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ.. వారం రోజుల ఆలస్యంగా ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్ రాసిన అభ్యర్ధుులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ పీజీ - 2023 పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ, వివరాలు ఇలా!
నీట్ పీజీ-2023 పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ పరీక్షలు మార్చి 5 నుంచి నిర్వహించాలని పరీక్షల నిర్వహణ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వరంగల్‌కు చెందిన పి.మురళీకృష్ణ మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్‌లతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 15న విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కొవిడ్ నేపథ్యంలో ఎంబీబీఎస్ పరీక్షల నిర్వహణ జాప్యం జరిగిందని, ఎంబీబీఎస్ పరీక్షల అనంతరం నీట్ పీజీ పరీక్షలకు సిద్ధం కావడానికి కనీస గడువు అవసరమన్నారు. గతేడాది మాదిరిగానే నీట్ పీజీ పరీక్షలను మే నెలలో నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం నీట్ పీజీ పరీక్షల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనిపై ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..