Exams Postponed: భారత్ బంద్.. తెలుగు రాష్ట్రాల్లో రేపు పలు పరీక్షలు వాయిదా..
Bharat Bandh: భారత్ బంద్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రేపు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొంత కాలంగా జాతీయ రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 27న భారత్ బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు భారత్ బంద్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు (సెప్టెంబర్ 27) నిర్వహించాల్సిన పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా..
రేపు నిర్వహించాల్సిన ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వెల్లడించారు. భారత్ బంద్ వల్ల స్టడీ సర్కిల్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు సైతం..
భారత్ బంద్ నేపథ్యంలో రేపు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మిరియాల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
Also Read: Bharat Bundh : భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు - బస్సులు నిలిపివేయాలని నిర్ణయం!
రేపు భారత్ బంద్‌కు మద్దతిస్తున్న పార్టీలివే..
రాష్ట్రపతి ఆమోదం పొందిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ బిల్లులను ఆమోదించి ఏడాది అవ్వడంతో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఈ నెల 27న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు రైతులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బంద్‌కు మద్దతు ఇవ్వగా, బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ కూడా నిరసనల్లో పాల్గొంటామని తెలిపింది. తాజాగా బ్యాంకర్స్ ఆఫీసర్స్ యూనియన్ కూడా భారత్ బంద్‌కు మద్దతిస్తున్నట్లు పేర్కొంది.
Also Read: Navodaya Admissions: నవోదయలో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..