Navodaya Admissions: నవోదయలో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Navodaya Vidyalaya Admissions: జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2022- 23 విద్యా సంవత్సరానికి సంబంధించి నవోదయ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో 9వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2022- 23 విద్యా సంవత్సరానికి సంబంధించి నవోదయ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021-22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు వివరాలు సహా మరింత సమాచారం కోసం https://navodaya.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఈ ప్రవేశ పరీక్షను 2022 ఏప్రిల్ 9న నిర్వహించనున్నట్లు నవోదయ విద్యాలయ సమితి వెల్లడించింది. ఆఫ్‌లైన్ (పెన్ అండ్ పేపర్) విధానంలో పరీక్ష జరగనుందని తెలిపింది. ఇది ఓఎంఆర్ షీట్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఈ పరీక్ష వ్యవధి రెండున్నర గంటలుగా ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. వివిధ సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
1. నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ www.navodaya.gov.in ఓపెన్ చేయాలి.
2. హోం పేజీలో క్లాస్ IX లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్–2022 అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు తమ రాష్ట్రం, జిల్లా వివరాలతో రిజిస్టర్ అవ్వాలి.
4. తమ వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి. తర్వాత సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
5. చివరిగా దరఖాస్తు రుసుం చెల్లించి, సబ్మిట్ ఆప్షన్ ఎంచుకోవాలి.
6. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
పరీక్షా విధానం..
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశ పరీక్ష వ్యవధి రెండున్నర గంటలుగా ఉంది. ఇంగ్లిష్, హిందీ, గణితం, సైన్స్ సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్ తీరులో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQs) అడుగుతారు. ఇంగ్లీష్, హిందీ మీడియంలలో ప్రశ్నపత్రం ఉంటుంది.
Also Read: CBSE On Covid19: ఆ విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త.. కొవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో బోర్డు కీలక ప్రకటన