APTET 2024 Results: ఏపీటెట్ - 2024 ఫలితాలు వచ్చేశాయ్, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
AP TET Results: ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన ఏపీటెట్ -2024 ఫలితాలను విద్యాశాఖ జూన్ 25న విడుదల చేసింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
![APTET 2024 Results: ఏపీటెట్ - 2024 ఫలితాలు వచ్చేశాయ్, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే AP TET 2024 Results Announced check direct link here APTET 2024 Results: ఏపీటెట్ - 2024 ఫలితాలు వచ్చేశాయ్, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/0049871f6e288a575a651d1455ba4a801706896091204522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP TET 2024 Results: ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్) ఫలితాలు నేడు (జూన్ 25) విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు ఏపీలో టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే టెట్ పరీక్షలకు మొత్తం 2.67లక్షల మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. 2.35 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదలను అధికారులు వాయిదావేశారు. తాజాగా ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది.
అర్హత మార్కులు: ఏపీటెట్‌కు సంబంధించి మొత్తం 150 మార్కులకు పేపర్-1, పేపర్-2 కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కనీస అర్హత మార్కులను ఓసీలకు 60 శాతంగా; బీసీలకు 50 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు. ఈ మేరకు ఫలితాలను అధికారులు విడుదల చేశారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే.
ఏపీటెట్ 2024 ఫలితాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ టెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://aptet.apcfss.in/
➥ అక్కడ హోమ్ పేజీలోని కింది భాగంలో APTET 2024 ఫలితాలకు సంబంధించిన 'Click here for Results' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ అక్కడ వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ ఐడీతోపాటు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేసి LOGIN బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ కంప్యూటర్ స్క్రీన్ మీద టెట్-2024 ఫలితాలు కనిపిస్తాయి. ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
APTET 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ టెట్ (AP TET)-2024 నోటిఫికేషన్‌ను విద్యాశాక ఈ ఏడాది ఫిబ్రవరి 7న వెల్లడించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాసేందుకు అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి అవకాశం కల్పించింది. టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 23న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు పేపర్-1 పరీక్షలు; మార్చి 2 నుంచి 6 వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించారు. అనంతరం టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేశారు. ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరించారు. మధ్యలో ఎన్నికల కోడ్ రావండంతో మార్చి 14న వెల్లడించాల్సిన టెట్ ఫలితాలను విద్యాశాఖ జూన్ 25న విడుదల చేసింది.
జులై 1 నుంచి 'మెగా డీఎస్సీ' దరఖాస్తుల స్వీకరణ..
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం 6,100 పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం (జూన్ 13) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంగా చంద్రబాబు అధికార పట్టాలు చేపట్టగానే 16,347 ఉద్యోగాలకు సంబంధించిన 'మెగా డీఎస్సీ'దస్త్రంపై తొలి సంతకం పెట్టారు. జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు ముగిసేలా ప్రణాళికను రూపొందించారు మెగా డీఎస్సీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. టెట్ మార్కులు వెలువడిన నేపథ్యంలో డీఎస్సీకి దరఖాస్తుల సంఖ్య భారీగానే వచ్చే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)