AP SSC Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు వారం వాయిదా! ఎప్పటి నుంచి ఉండొచ్చంటే?
AP SSC Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు వారం పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఇంటర్, టెన్త్ పరీక్షలు కొన్ని ఒకే రోజు ఉండడంతో నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయని విద్యాశాఖ భావిస్తోంది.
AP SSC Exams : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు(10th Class Exams) వారం రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. మే 2 నుంచి జరగాల్సిన పరీక్షలను మే 9 లేదా 13 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విద్యా శాఖ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పది, ఇంటర్ పరీక్షల్లో కొన్ని ఒకే తేదీన రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అలాగే జేఈఈ పరీక్షల షెడ్యూల్ వల్ల ఇంటర్ పరీక్షలు వాయిదా(Inter Exams Postponed) వేయండంతో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో కొన్ని ఒకే రోజున వస్తున్నాయి.
ఇప్పటికే ఇంటర్ పరీక్షలు వాయిదా
ఏపీలో ఇంటర్ పరీక్షలను(Inter Exams) ఏప్రిల్ 8 నుంచి 28 వరకు నిర్వహించాలని విద్యాశాఖ భావించింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది. కానీ జేఈఈ పరీక్షలను(JEE Exams) ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తేదీలను ప్రకటించింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని షెడ్యూల్ ప్రకటించింది. పదో తరగతి పరీక్షలు మే 2 నుంచి 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే ఇంటర్, టెన్త్ పరీక్షలకు కొన్ని చోట్ల ఒకే పరీక్ష కేంద్రంలో నిర్వహించాల్సిన కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసుల భద్రత, వసతి ఇబ్బందులు
పదో తరగతి పరీక్ష కేంద్రాలను మరో చోటికి మార్చడానికి వీలులేకపోవడంతో పరీక్షలు వారం పాటు వాయిదా వేసేందుకు విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరిగితే పోలీస్ స్టేషన్లలో ప్రశ్నపత్రాలు, జవాబులు రాసే బుక్ లెట్లు, ఇతర పరీక్ష సామగ్రి భద్రపరిచేందుకు వసతి ఇబ్బందులు కలగనున్నాయి. రెండు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకానికి కూడా సమస్య తలెత్తనుంది. ఈ కారణాలతో పదో తరగతి పరీక్షలను వారం పాటు వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. మే 9 నుంచి లేదా 13వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించింది.
ఇంటర్ పరీక్షలు
ఇప్పటికే ఇంటర్మీడియట్(Intermediate) పరీక్షలు వాయిదా(Postpone) పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(Adimulapu Suresh) ప్రకటించారు. జేఈఈ మెయిన్స్(JEE Mains) కారణంగా ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించింది. దీంతో పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ గురువారం తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు మార్చి 11 నుంచి మార్చి 31వరకు జరుగుతాయని మంత్రి సురేశ్ తెలిపారు. కోవిడ్(Covid) నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు(Inter Board) తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వెల్లడించారు.