AP POLYCET: ఆగస్టు 30 నుంచి ఏపీ పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి 'పాలిసెట్-2023' తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానుంది. సెప్టెంబరు 4 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి 'పాలిసెట్-2023' తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానుంది. సెప్టెంబరు 4 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకు ఫీజు చెల్లించవచ్చు. అవే తేదీల్లో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహిస్తారు. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయినవారు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబరు 4న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో సెప్టెంబరు 7లోపు చేరాల్సి ఉంటుంది.
షెడ్యూలు ఇలా..
➥ ఫీజు చెల్లింపు: 30.08.2023 - 01.09.2023.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 30.08.2023 - 01.09.2023.
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 30.08.2023 - 02.09.2023.
➥ సీట్ల కేటాయింపు: 04.09.2023.
➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 04.09.2023 - 07.09.2023.
ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి పాలిసెట్-2023 కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎట్టకేలకు మొదటి విడత సీట్లను ఆగస్టు 18న అధికారులు కేటాయించారు. అధికారిక వెబ్‌సైట్‌లో కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్థుల జాబితాను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు లాగిన్ వివరాలు నమోదుచేసి సీటు కేటాయింపు నిర్దారించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.
ఏపీలో పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగస్టు 11 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 14 వరకు ఆప్షన్లను నమోదుచేసుకున్నారు. ఆగస్టు 16న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 18న సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 19 నుంచి 23 మధ్య సంబంధిత పాలిటెక్నిక్ కళాశాల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్ 1 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించారు. మే 29 నుంచి జూన్ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించాల్సి ఉండగా... కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూలును అధికారులు వెల్లడించారు.
ఏపీలో మే 10న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్-2023)ను 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రాలలో పాలిసెట్ 2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు. మే 20న ఫలితాలను విడుదల చేయగా.. ఫలితాల్లో 86.35 శాతం ఉత్తీర్ణులయ్యారు.