Crime News: ఏపీలో దారుణం - యువతిపై బ్లేడుతో ప్రేమోన్మాది దాడి, నిందితున్ని పట్టుకున్న స్థానికులు
Andhrapradesh News: గుంటూరు జిల్లాలో ఓ ప్రేమోన్మాది హల్చల్ చేశాడు. ఆదివారం ఉదయం ఓ యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. యువతిని ఆస్పత్రిలో చేర్చగా.. నిందితున్న స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Young Man Attacked On Young Woman In Tadepalli: ఓ యువతిపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి చేసిన దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆదివారం గుంటూరు జిల్లాలో జరిగింది. తాడేపల్లి వడ్డేశ్వరం వద్ద యువతిని అడ్డగించిన యువకుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన యువతి స్థానికంగా ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో మూడేళ్లుగా నర్సుగా పని చేస్తోంది. వైద్య కళాశాలకు చెందిన హాస్టల్‌లోనే ఉంటూ విధులకు వెళ్లి వస్తోంది. ఆదివారం సెలవు కావడంతో చర్చికి వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే బందరు సమీపంలోని క్రోసూరుకు చెందిన క్రాంతి మౌళి యువతితో మాట్లాడేందుకు యత్నించాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని యువతికి చెప్పగా ఆమె నిరాకరించింది.
బ్లేడుతో యువతిపై దాడి
తన ప్రేమను యువతి నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన క్రాంతి తన వద్ద ఉన్న బ్లేడుతో ఆమె మెడపై దాడి చేశాడు. అతన్ని తప్పించుకునే క్రమంలో భయంతో నిందితున్ని యువతి పక్కకు నెట్టేయగా ఆమె చేతిపైనా గాయాలయ్యాయి. దీంతో తీవ్ర గాయాలతో యువతి కింద పడిపోయింది. నిందితుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకున్నారు. యువతిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.