Yadadri Crime News: ప్రేమ వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య , గతంలోనూ ఓసారి ఆత్మహత్యాయత్నం
Yadadri Crime News: యువకుడి ప్రేమ వేధింపులు భరించలేక పదో తరగతిని విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గంతోనూ ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. అదృష్టవశాత్తు బతికింది. కానీ..!
Yadadri Crime News: ఆ అమ్మాయి పదో తరగతి చదువుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు చాలా కాలంగా ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఎన్ని సార్లు ఇది మానుకోవాలని చెప్పినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఓసారి ధైర్యం చేసిన అమ్మాయి గట్టిగా గొడవ పడింది. అయినా అతడు వేధింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థిని గతనెల 31వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చగా.. అదృష్టవశాత్తు బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈనెల 2వ తేదీనే డిశ్చార్జీ అయింది. ఇంత జరిగినా సదరు యువకుడు వేధింపులు ఆపలేదు. దీంతో మరోసారి బాలిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లిక్ పల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఉప్పునూతల కావ్య.. చౌటుప్పల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. అయితే బాలిక అప్పుడప్పుడూ సోషల్ మీడియా వాడేది. ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి యాప్స్ వాడేది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి.. కావ్యకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా మెసేజ్ లు పంపించేవాడు. పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడు. అయితే అమ్మాయి అతడి ప్రేమను నిరాకరించింది. దీంతో శివమణి బెదిరింపులకు పాల్పడేవాడు, మీ అన్నను, నాన్నను చంపేస్తానంటూ వేధించేవాడు. డబ్బులు కూడా ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడ్డ కావ్య ఇటీవలే ఆ విషయాన్ని తన సోదరుడు నరేష్ కు తెలిపింది. దీంతో తన చెల్లికి మెసేజ్ పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని శివమణిని నరేష్ హెచ్చరించాడు.
ఇదే క్రమంలో డిసెంబర్ 31వ తేదీన నరేష్, శివమణి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం సద్దుమణిగాక ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే శివమణి మళ్లీ కావ్యకు ఫోన్ చేసి ఈరోజు మీ అన్నను చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన కావ్య.. తాను చనిపోతే ఈ సమస్య తీరుతుందని భావించింది. వెంటనే ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు.. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించారు. అదృష్టవశాత్తు కావ్య ప్రాణాలతో బయటపడింది. ఈనెల 2వ తేదీన కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కూడా అయింది. అయితే తమ కూతురు ఆత్మహత్య వరకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టించారు.
ఇకపై శివమణి.. కావ్య, ఆమె కుటుంబ సభ్యుల జోలికి పోకుండా చూసుకోవాలని అతడి తల్లిదండ్రులకు తెలిపారు. అయినా శివమణి మెసేజ్ లు చేస్తూనే ఉన్నాడు. ఇంత జరిగినా పట్టించుకోకుండా.. కావ్య వెంట పడుతూనే ఉన్నాడు. దీంతో తీవ్రంగా కలత చెందిన కావ్య ప్రాణాలు తీసుకోవాలనుకుంది. బుధవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుంది. సాయంత్రం నరేష్ ఇంటికి వచ్చి చూడగా.. కావ్య ప్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన నరేష్ విపరీతంగా ఏడ్చాడు. అది విన్న స్థానికులు కూడా వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకొని కావ్య మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు.
అయితే గురువారం సాయంత్రం కావ్యకు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోచంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ... ర్యాలీ నిర్వహించారు.