పోలవరం జిల్లా ఇర్లపల్లి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న శివానీ అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
ఇటీవల పోలవరం జిల్లాలో పీటీఎంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసల్లో ముంచెత్తడంతో పాటు సెల్ఫీ దిగిన 10వ తరగతి విద్యార్థిని శివానీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

- ఇర్లపల్లిలో 10వ తరగతి శివానీ అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడింది.
- మూడు రోజుల ముందే ఆమె సీఎం చంద్రబాబును కలుసుకుంది.
- సూసైడ్ నోట్‌లో కుటుంబ కలహాలతో బాధపడినట్లు బాలిక రాసింది.
- పోలీసులు కేసు నమోదు చేసి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
పోలవరం: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా ఇర్లపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న శివానీ అనే విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కేవలం మూడు రోజుల క్రితమే ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం (Talliki Vandanam) కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ బాలిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి భోజనం చేయడమే కాకుండా ఆయనతో సెల్ఫీ కూడా దిగింది. ఆ కార్యక్రమంలో జరిగిన పేరెంట్-టీచర్స్ మీటింగ్‌లో తన అద్భుతమైన ప్రసంగంతో ముఖ్యమంత్రిని సైతం ఆకట్టుకుంది.
వచ్చే ఏడాది తాను 'షైనింగ్ స్టార్' అవార్డును గెలుచుకుంటానని బాలిక ధీమా వ్యక్తం చేయగా, సీఎం చంద్రబాబు ఆమెను ఎంతగానో అభినందించారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పొల్గొన్న ప్రభుత్వ ప్రోగ్రాంలో అందరినీ ఆకట్టుకున్న ఆ బాలిక మూడు రోజుల్లోనే రేకుల షెడ్డులో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె బలవన్మరణానికి పాల్పడటానికి గల అసలు కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సరిగ్గా మూడు రోజుల క్రితం (జులై 24న) రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు నాయుడి సమక్షంలో "సర్, నేను ఏదైనా సాధిస్తాను.. వచ్చే ఏడాది మీ చేతుల మీదుగానే అవార్డు తీసుకుంటాను" అంటూ ధీమాగా మాట్లాడి అందరి మెప్పు పొందిన ఈ చిన్నారి, ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
ఆమె రాసిన సూసైడ్ నోట్ చూస్తుంటే ప్రతీ ఒక్కరి కళ్లు చమర్చుతున్నాయి. ‘అమ్మా, నాన్నా మీ కోసం చాలా కష్టపడదాం అనుకున్నాను. మీరు కలలుగన్న జీవితాన్ని మీకు ఇద్దాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. బతకాలని ఉంది కానీ, బతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఈ బాధను భరించడం నా వల్ల కావడం లేదు.. సారీ అమ్మా, క్షమించు నాన్నా’ అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: Modi Shah Jagan Appointment: జగన్‌కు మోదీ-షా అపాయింట్‌మెంట్ ఇస్తే? కూటమిపై ప్రభావం ఎంత?
తన కుటుంబం ఐక్యంగా ఉండాలని కోరుకున్న ఆ బాలిక ‘అన్నయ్యా, వదినా, అమ్మా, అమ్మమ్మా.. మీరు ఎప్పటికైనా కలవండి, ఒకరినొకరు ద్వేషించుకోకండి.. సారీ బై బై’ అంటూ కుటుంబ సభ్యులను వేడుకుంటూ ఆత్మహత్య చేసుకుంది. అంతా కలసి ఉండాలని ఆశపడిన కుటుంబం విడిపోయి ఉండటంతో మనస్తాపానికి గురై ఆ చిన్నారి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇది ఆత్మహత్యనా, హత్యనా ఇందుకు కారణాలపై విచారణ జరుపుతున్నారు.
విద్యార్థిని శివాని మృతి తీవ్ర విచారం కలిగించింది : చంద్రబాబు
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్యపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇటీవల రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని ఆత్మహత్య ఆవేదన కలిగించింది. తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం చాలా బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని తనువు చాలించడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా ఉండాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకులోను కావొద్దు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కనుక మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో, స్నేహితులతో పంచుకోండి. ఒత్తిడిని అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని’ చంద్రబాబు హామీ ఇచ్చారు.
Frequently Asked Questions
పోలవరం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఎవరు?
ఆత్మహత్య చేసుకున్న శివానీ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యిందా?
అవును, మూడు రోజుల క్రితం 'తల్లికి వందనం' కార్యక్రమంలో శివానీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి భోజనం చేసి, సెల్ఫీ దిగింది. తన ప్రసంగంతో సీఎంను ఆకట్టుకుంది.
శివానీ సూసైడ్ నోట్‌లో ఏం రాసింది?
సూసైడ్ నోట్‌లో తల్లిదండ్రుల కోసం కష్టపడలేకపోతున్నానని, బతకడం కష్టంగా ఉందని పేర్కొంది. కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉండాలని కూడా కోరింది.
విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి?
కుటుంబంలో నెలకొన్న విభేదాలు, కుటుంబ సభ్యులు విడిపోయి ఉండటం వల్ల మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























