Hyderabad News: భర్తను కొట్టిన వైన్ షాప్ సిబ్బంది - ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, ఏం చేసిందంటే?
Telangana News: తన భర్త తల పగలగొట్టిన వైన్ షాప్ సిబ్బందిపై ఓ మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది. వారిపై దాడి చేయడం సహా మందుబాటిళ్లను ధ్వంసం చేసింది. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి పాల్పడింది.
Wife Attacked On Wine Shop Staff: తాగొచ్చి తనను భర్త కొడుతున్నాడనే భార్యలను చూశాం. అంతెందుకు నా భార్య నన్ను మానసికంగా వేదనకు గురి చేస్తోంది కాపాడండి అంటూ పోలీసులను వేడుకున్న భర్తల ఘటనలూ చూశాం. అయితే, ఓ వ్యక్తిపై వైన్ షాప్ సిబ్బందిపై దాడి చేయగా తీవ్ర గాయాలు కాగా.. అతన్ని చూసిన భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే వైన్ షాపులోకి వెళ్లి అక్కడి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డొచ్చిన పోలీసులపైనా దాడికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ లో ఓ వైన్ షాపునకు వెళ్లిన వ్యక్తి మద్యం ఇవ్వాలని అడిగాడు. అయితే, పేమెంట్ విషయంలో గొడవ జరిగి.. మాటా మాటా పెరిగి వైన్ షాప్ సిబ్బంది అతని తల పగలగొట్టారు.
వైన్ షాపు సిబ్బందిపై భార్య దాడి
తీవ్ర గాయాలతో ఇంటికొచ్చిన భర్తను చూసిన భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే వైన్ షాపు వద్దకు వెళ్లి సిబ్బందితో గొడవకు దిగింది. 'నా భర్తపైనే దాడి చేస్తారా.?' అంటూ షాపులోకి చొరబడి వారిపై దాడి చేసింది. అక్కడ మందు బాటిళ్లను ధ్వంసం చేసింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళను అడ్డుకునేందుకు యత్నించారు. అయితే, వారిపై కూడా సదరు మహిళ ఆగ్రహంతో దాడి చేసింది. ఈ క్రమంలో పోలీసులు సదరు మహిళ సహా, వైన్ షాప్ సిబ్బందిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.