Warangal Preethi Case : హత్యా? ఆత్మహత్యా?- ప్రీతి కేసులో కీలకంగా ఫోరెన్సిక్ రిపోర్టు
Warangal Preethi Case : వరంగల్ కాకతీయ మెడికో ప్రీతి కేసు ఫోరెన్సిక్ రిపోర్టు వరంగల్ పోలీసులకు అందింది. ప్రీతిది హత్యా? లేదా ఆత్మహత్యా? అనేది ఇవాళ తేలే అవకాశం ఉంది.
Warangal Preethi Case : తెలంగాణలో సంచలనం రేపిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, సైఫ్ హత్య చేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుందని పోలీసులు చెబుతుండగా.. సైఫ్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశాడని తండ్రి చెబుతున్నారు. తండ్రి ఆరోపణలతో పోలీసులు కూడా హత్య కోణంలో దర్యాప్తు చేస్తోన్నారు. ఇవాళ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వరంగల్ పోలీసులకు అందింది. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ఆధారంగా ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్టు సిద్ధమైంది. ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్టును కూడా పోలీసులు తీసుకున్నారు. దీంతో ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్టును పోలీసులు బయటపెట్టే అవకాశముంది.
హత్యా? ఆత్మహత్యా?
ప్రీతిది హత్యా? లేదా ఆత్మహత్యా? అనే అనుమానాలకు ఫోరెన్సిక్ రిపోర్ట్ తెరదించనుంది. తమ కూతురిని సైఫ్ హత్య చేశాడని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తండ్రి చెబుతున్నాడు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు కూడా పంపామన్నారు. ప్రీతికి ఇంజెక్షన్ ఇచ్చి చనిపోయిందనుకుని సైఫ్ వెళ్లాడని, అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని తోటి సిబ్బంది హాస్పిటల్‌కు తరలించినట్లు చెబుతున్నారు. దీంతో ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారింది. ప్రీతి బాడీలోని ఇంజెక్షన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. అది ఏం ఇంజెక్షన్ అనేది వైద్యులు లేదా పోలీసులు బయటపెట్టలేదు. ప్రమాదకరమైన ఇంజెక్షన్ అని చెబుతున్నా.. ఆ ఇంజెక్షన్ పేరు ఏంటనేది బయటకు రాలేదు.
కీలకంగా స్క్రీన్ షాట్స్, ఆడియో కాల్స్
ఫోరెన్సిక్ రిపోర్టులో వివరాలన్నీ ఉండే అవకాశముందని చెబుతున్నారు పోలీసులు. ప్రీతి ఆత్మహత్య కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత ఒత్తిడితోనే ప్రీతి చనిపోయినట్లు కాలేజీ యాజమాన్యం చెప్పగా.. ఆ తర్వాత విద్యార్థి సంఘాల ఆందోళనలతో సైఫ్ వేధింపుల వల్ల చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి ముందే చెప్పడం, సైఫ్ వాట్సప్ మెసేజ్‌లు బయటపడటంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సైఫ్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రీతి వాట్సప్ ఛాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్, ఆడియో కాల్స్ ఆధారంగా సైఫ్‌ను విచారిస్తున్నారు. సుదీర్ఘంగా అతడిని అన్ని విషయాలు అడుగుతున్నారు. సైఫ్ విచారణలో పలు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. వాటిని త్వరలో పోలీసులు బయటకు వెల్లడించే అవకాశముంది. ఈ క్రమంలో ఫోరెన్సిక్ రిపోర్టు అత్యంత కీలకంగా మారిందని చెప్పవచ్చు.
ప్రీతిని సైఫ్ ర్యాగింగ్ చేశాడు.. కమిటీ నిర్ధారణ
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రీతి మరణంపై యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇటీవల సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలపాటు కమిటీ సభ్యులు పలు అంశాలపై చర్చించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించాడని, ఇది కచ్చితంగా ర్యాగింగ్ కిందకి వస్తుందని, ర్యాగింగ్ జరిగిందని కమిటీ నిర్ధారించింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన మొత్తం 13 మంది యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు ఏం జరిగింది, అందుకు గల కారణాలపై కీలకంగా చర్చ జరిగింది.