Pappu Cheeti Fraud Case: పప్పు చీటీలు కట్టించుకుని రూ.11 కోట్ల రూపాయలతో జంప్ - చావే గతి అంటున్న మహిళలు
ఒక్క గుర్ల, నెల్లిమర్ల మండలాలకే పరిమితం కాలేదు. విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి తదితర ప్రాంతాల్లోనూ పలువురితో పప్పుల చీటీలు కట్టించుకుని కోట్లాది రూపాయలతో నిందితులు ఉడాయించారు.
Vizianagaram Pappu Cheeti Fraud Case : విజయనగరం జిల్లాలోని గుర్ల మండలంలో ఇటీవల వెలుగు చూసిన పప్పుల చీటీల మోసం ఘటనలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది ఒక్క గుర్ల, నెల్లిమర్ల మండలాలకే పరిమితం కాలేదు. విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి తదితర ప్రాంతాల్లోనూ పలువురితో పప్పుల చీటీలు కట్టించుకుని కోట్లాది రూపాయలతో నిందితులు ఉడాయించారు. బాధితులు ప్రతి రోజూ ఏదో చోట తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో చీటీలు కట్టిన వారితోపాటు.. నిందితుల మాటలు నమ్మి, తెలిసిన వారే కదా! అన్న నమ్మకంతో, కమీషన్‌కు ఆశపడి.. పలువురితో డబ్బులు కట్టించుకున్న ఏజెంట్లూ ఉన్నారు. నెలకు ఒక్కో కార్డు ద్వారా రూ.300 వరకూ కట్టించుకున్నారు. ఇలా బాధితులు ఏడాదికి రూ.3,600 కడితే.. ఒక్కో ఏజెంటు తమ పరిధిలోని దాదాపు 200 మందితో చీటీలు కట్టించారు. ఇలా ఒక ఏజెంటు సుమారు రూ.4 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు కట్టించినట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.11 కోట్లకుపైగా వసూలు చేసి నిందితులు ఉడాయించినట్లు సమాచారం.
ఏజెంట్లను నిలదీస్తున్న బాధితులు
‘‘దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరో మాకెందుకు. మాతో డబ్బులు కట్టించుకున్నది మీరే. మీ మాటలు నమ్మి మేం నెలనెలా డబ్బులు కట్టాం. మీరు బంగారం అమ్ముకుంటారో, ఆస్తులు తాకట్టు పెట్టుకుంటారో.. మా డబ్బులు మాకివ్వండి..’’ అంటూ బాధితులు గ్రామాల్లో ఏజెంట్లను నిలదీస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఏజెంట్లు ఆందోళన చెందుతున్నారు. కమీషన్‌కు ఆశపడి మధ్యలో తాము ఇరుక్కుపోయామని, దీనివల్ల మా భర్తలు ఇంటి నుంచి వెళ్లగొడుతునన్నారని, ఊళ్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని ఏజెంట్లుగా వ్యవహరించిన పలువురు మహిళలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ‘‘పోలీసులను సంప్రదిస్తే.. కేసు పెడతాం, కోర్టులో వేస్తాం అంటున్నారు.. మాకు అవేవీ వద్దు. పెద్ద మనుషుల్లో కూర్చొబెట్టి న్యాయం చేయండి. వారి ఆస్తులు అమ్మకం చేసైనా మా డబ్బులు మాకు ఇప్పించండి’’ అంటూ బాధితులు స్పష్టం చేస్తున్నారు.
మాకు చావే శరణ్యం
‘బొబ్బిలి, విజయనగరం పరిధిలోని కేఎల్‌పురం ప్రాంతాల్లో 201 మందితో సుమారు రూ.7 లక్షల వరకూ కట్టించాను. ఇప్పుడు సంస్థ వారు ప్లేటు ఫిరాయించారు. చీటీ కట్టిన వారు మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇంటి వద్ద ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. అంత డబ్బులు నేను ఎక్కడ నుంచి తేగలను?’’ కేఎల్ పురానికి చెందిన కె.మంజు వాపోయింది. తాను 513 మందితో రూ.18.46 లక్షలు కట్టించానని, ఆ మొత్తం ఇప్పుడు తననే ఇమ్మంటున్నారని ఒంపిల్లి గ్రామానికి చెందిన లక్ష్మి వాపోయింది. అంత మొత్తంలో తాము ఎలా తేగలమని, చావు ఒక్కటే మాకు శరణ్యమని ఏజెంట్లు వాపోతున్నారు. గజపతి నగరం బీసీ కాలనీకి చెందిన మండ సంతు 185 కార్డుల ద్వారా రూ.6.6 లక్షలు, మైత్రి 125 మంది నుంచి రూ.4.50 లక్షలు.. ఇలా అనేక మంది ఏజెంట్లుగా మారి రూ.లక్షల్లో కట్టించుకున్నారు. ఇప్పుడు వీరంతా కూడా నష్టపోవడంతో లబోదిబోమంటున్నారు.