Vizianagaram: మత్తెక్కించేలా కిలాడీ బార్బర్ హెడ్ మసాజ్, ముగిసేసరికి ఒంటిపై అవన్నీ మాయం!
Vizianagaram News: మంచిగా తమకు మసాజ్, హెయిర్ కటింగ్ చేయడమే కాకుండా వారు కాస్త నిద్రలోకి జారుకోగానే మెడలో ఉన్న బంగారు గొలుసులను చోరీ చేస్తాడు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా చైన్ లను దొంగిలించాడు.
Vizianagaram Crime News: తన వద్దకు క్షవరం నిమిత్తం వచ్చే కస్టమర్లకు మర్దన చేస్తే మంచిదని, తపనొప్పి ఒత్తిడి పోతుందని, డబ్బులు కూడా ఎక్కువ అవసరం లేదని చెబుతాడు. మెల్లగా ఒప్పిస్తాడు. మంచిగా మర్దన చేస్తూ.. మాటల్లో పెడతాడు. వారు కాస్త నిద్రలోకి జారుకోగానే ఆపై చాకచక్యంగా వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను కొట్టేస్తాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన పని తాను చూసుకుంటాడు. గొలుసు ఎక్కడ పోయిందో తెలియక బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇన్నాళ్లూ అతని ఆటలు సాగాయి. ఎట్టకేలకు అతని పాపం పండింది. పోలీసులకు చిక్కాడు. కటకటాల పాలయ్యాడు.
సెలూన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న శ్రీను..
విజయనగరం పట్టణం ఆర్టీసీ కాలనీలో ఓ సెలూన్ షాప్ నడుపుకొంటూ గంట్యాడ మండలం జగ్గుపురం గ్రామానికి చెందిన బెల్లపు శ్రీను జీవనం సాగించేవాడు. సెలూన్ షాప్ కు వచ్చే వాళ్లకు మర్దన, కటింగ్ చేస్తూ మంచిగా మాటలు చెప్పేవాడు. గంటలు గంటలు అదే పని చేయడంతో వారు నిద్రలోకి జారుకునే వారు. అదే అదునుగా వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను కొట్టేశేవాడు. తమ గొలుసులు ఎక్కడ పోయాయో కచ్చితంగా చెప్పలేని బాధ్యతలు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడేవారు. ఇటీవల కాలంలో విజయనగరం పట్టణానికి చెందిన ఇమంది బైరాగి, జయంతి శ్రీరామ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిద్రలోకి జారుకోగానే గొలుసుల చోరీ..
అయితే సెలూన్ బార్బర్ పై అనుమానం ఉందని చెప్పడంతో బెల్లపు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గట్టిగా విచారించేసరికి భయపడిపోయి నేరం ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే అతని వద్ద నుంచి రెండు బంగారు చైనులను రికవరీ చేసినట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. సెలూన్ షాపులకు వెళ్లే కస్టమర్లు మర్దన, కటింగ్ సమయాల్లో తమ విలువైన ఆభరణాలు, వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కేసుల విచారణలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్సై వి.అశోక్ కుమార్, హెచ్ సీ అచ్చిరాజు, కానిస్టేబుల్ శ్రీనివాసరావు తదితరులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
పల్లీల కోసం వచ్చి చోరీ..
పది రోజుల క్రితం గుంటూరు జిల్లా కొల్లిపరలో జరిగిన చోరీ ఘటన ఆసక్తిగా మారింది. స్థానికంగా ఉన్న దుకాణంలో ఒక వ్యక్తి పల్లీలు కోసం వచ్చాడు. మొదట పల్లీలు కావాలంటూ మాటలు కలిపిన అతను తర్వాత చాలా సరకులు తీసుకున్నాడు. అయితే అనుకోకుండా తన ఫోన్ ఇంట్లో మరచిపోయానంటూ దుకాణంలో ఉన్న యజమానురాలి ఫోన్ అడిగాడు. సరకులను ప్యాకింగ్ చేసే పనిలో ఉన్న ఆమె తన ఫోన్‌ను అతనికి ఇచ్చింది. దానికి లాక్ ఉండటంతో మరలా అతను ఆ ఫోన్‌ను ఆమెకు ఇచ్చేశాడు. బిల్లు ఇవ్వడానిక తన వద్ద డబ్బులు లేవంటూ మరోసారి ఆమె ఫోన్ కావాలని అడిగాడు. అయితే పనిలో బిజిగా ఉన్న ఆమె ఎదో ధ్యాసలో పడి ఫోన్ లాక్ తీసి అతనికి ఇచ్చింది. కాసేపటికే ఆమె ఫోన్ ఇచ్చేశాడు. ఎవరూ లిప్ట్ చేయటం లేదని చెప్పాడు. ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకు వస్తానంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. అతను వెళ్లిన నిమిషాల వ్యవదిలోనే ఫోన్‌లో గూగుల్ పే నుంచి 25వేల రూపాయలు నగదు డ్రా అయినట్లుగా మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె ఖంగుతింది.