Viral News: ఇదేం లవ్ మావా బ్రో! పెళ్లయినా ప్రియుడ్ని కిడ్నాప్ చేసి, తాళికట్టించుకున్న లవర్
Lover Kidnap: వాళ్లిద్దరు కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు నడిచిన ప్రేమ వ్యవహారం విభేదాలు రావడంతో విడిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
Lover Kidnap: వాళ్లిద్దరు కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు నడిచిన ప్రేమ వ్యవహారం విభేదాలు రావడంతో విడిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ముందు ప్రేమించిన యువతి మాత్రం యువకుడిని మర్చిపోలేకపోయింది. ఎలాగైనా అతడిని దక్కించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా స్కెచ్ వేసింది. తల్లిదండ్రులతో కలిసి అతడిని కిడ్నాప్ చేయించి.. బలవంతంగా తాళి కట్టించుకుంది.
చెన్నై వేళచ్చేరికి చెందిన పార్తిబన్, రాణిపేటకు చెందిన సౌందర్య కాలేజీ రోజుల్లో స్నేహితులు. ఏడేళ్ల పాటు వీరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే మధ్యలో విభేదాలు రావడంతో విడిపోయారు. కొద్ది రోజులకు పార్తిబన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మరో యువతిని ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో వారి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.
అయితే ఏమైంతో ఏమో ముందు ప్రేమించిన సౌందర్య మళ్లీ పార్తిబన్‌కు దగ్గరవ్వాలనుకుంది. అతని కోసం ఆరా తీసింది. పార్తిబాన్‌కు పెళ్లి జరిగిందని తెలుసుకుని ఫీల్ అయింది. అయితే అతని మీద ఇష్టంతో ఎలాగైనా సరే అతడిని దక్కించుకోవాలనుకుంది. తల్లిదండ్రుల సాయంతో స్కెచ్ వేసింది. ఇందుకు సాయుధ దళంలో పని చేస్తున్న బందువు సహకరించాడు. పార్తిబాన్‌ను కిడ్నాప్ చేసేందుకు పక్కా పథకం వేసింది. ఒంటరిగా వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు.
గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పార్తీబన్ తన అపార్ట్‌మెంట్ నుంచి ఆఫీస్‌కు బయల్దేరినప్పుడు సౌందర్య, కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. పార్తీబన్ వారిని అడ్డుకోవడానికి యత్నించినా అతనిపై దాడి చేసి కారులో పడేశారు. కారును ఆపడానికి ప్రయత్నించినందుకు అతని తల్లిని కూడా కొట్టడానికి ప్రయత్నించారు. చెన్నై నుంచి నేరుగా కాంచీపురంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే సినిమా ఫక్కీ తరహాలో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. సౌందర్య మెడలో పార్తీబన్ చేత బలవంతంగా తాళి కట్టించారు.
కొడుకు కిడ్నాప్ గురించి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియన వ్యక్తులు నలుగురు తమపై దాడి చేశారని, తన కొడుకును కళ్ల ముందే కారులో కిడ్నాప్ చేశారని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వెలచ్చేరి పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాంచీపురంలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం కాంచీపురం వెళ్లి కిడ్నాపర్ల బారి నుంచి పార్థిబన్‌ను రక్షించారు.
దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. పార్తీబన్ కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయితో రిలేషన్ షిప్‌లో ఉండేవాడని, అయితే 2016లో ఆమెతో విడిపోయాడని తెలిపారు. బ్రేకప్ తర్వాత సౌందర్యతో ఏడాది వరకు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అయితే వారి సంబంధం దెబ్బతినడంతో పార్తిబన్ సౌందర్యతో విడిపోయి తన మాజీ ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. కిడ్నాప్ వ్యవహారంలో ప్రధాన నిందితులు సౌందర్య(27), ఆమె తల్లి ఉమ (50), బంధువు రమేష్ (39), ఆమె మేనమామ శివకుమార్ (48)లను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.