(Source: ECI/ABP News/ABP Majha)
Vijayawada Girl Suicide: విజయవాడలో బాలిక సూసైడ్ కలకలం... 2 నెలలుగా వేధిస్తున్న టీడీపీ నేత...!
విజయవాడ బాలిక సూసైడ్ కలకలం రేపుతోంది. టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులు కారణంగానే బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్థారించారు. బాలిక రాసిన సూసైడ్ నోట్ ఈ విషయం ఉందన్నారు.
విజయవాడలో బాలిక సూసైడ్ సంచలనమైంది. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలిక శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతుంది. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని బాలిక సూసైడ్ నోట్‌లో రాసింది. ఈ విషయాన్ని ఏసీపీ హనుమంతరావు మీడియాకు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినోద్ జైన్ పై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్ల ప్రకారం కేసులను పెట్టామని ఏసీపీ హనుమంతరావు స్పష్టం చేశారు. వినోద్ జైన్ లైంగిక వేధింపుల కారణంగానే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
2 నెలలుగా లైంగిక వేధింపులు
బాలిక పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. విచారణ కోసం ఇప్పటికే వినోద్ జైన్ ఇంటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గత 2 నెలలుగా వినోద్‌జైన్ బాలికను లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసిక క్షోభతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. ఈ విషయాలు బాలిక సూసైడ్ నోట్ లో రాసిందని ఏసీపీ తెలిపారు. అపార్ట్ మెంట్ లిఫ్ట్‌లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వినోద్ జైన్ వేధించేవాడని సూసైడ్ నోట్‌లో రాసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు : వాసిరెడ్డి పద్మ
విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటనపై మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. బాలిక సూసైడ్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక సూసైడ్ నోట్‌లో రాసిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసుల విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనకు కారణమైన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కూడా స్పందించారు. ఈ ఘటన బాధాకరం అన్నారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బాలికను ఎంతలా వేధించాడో ఆమె రాసిన సూసైడ్ నోట్ లో అర్థం అవుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే రోజా కోరారు.