Vijayawada Crime News: గోల్డ్ స్కీం పేరుతో 2 కోట్లు వసూలు - తిరిగి చెల్లించలేక ఇద్దరి ఆత్మహత్య
Vijayawada Crime News: గోల్డ్ స్కీం పేరుతో ఇద్దరు రెండు కోట్ల రూపాయలు వసూలు చేశారు. వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని బాధఇతులు పోలీసులను ఆశ్రయించారు.
Vijayawada Crime News: గోల్డ్ స్కీం పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇలా చాలా మంది నుంచి దాదారు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు. కానీ వాటిని తిరిగి చెల్లించలేక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితులు కన్నీరుమున్నీరు అవుతూ పోలీసులను ఆశ్రయించారు.
అసలేం జరిగిందంటే?
విజయవాడలోని భవానీపురం నేతాజీ స్కూలు రోడ్డులో 50 ఏళ్ల తారక రామారావు నివాసం ఉంటున్నారు. అయితే ఈయన వన్ టౌన్ లో బంగారం వ్యాపారం చేసేవారు. ఆయనకు కొన్నేళ్ల కిందట అదే ప్రాంతం బాలాభాస్కర్ నగర్ లో నివాసం ఉండే 48 ఏళ్ల తుపాకుల దుర్గాదేవితో పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరూ కలిసి గోల్డ్ స్కీం పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. నెలకు కొంత మొత్తం చెల్లిస్తే బంగారు ఆభరణాలు ఇస్తామంటూ నమ్మబలికారు. దుర్గా దేవి గతంలో దుస్తుల వ్యాపారం చేసేవారు. ఆ పరిచయంతో మహిళల నుంచి డబ్బులు వసూలు చేసి గోల్డ్ స్కీంలో సభ్యులుగా చేర్పించారు. గోల్డ్ స్కీంతో పాటు చీటీలు వేయడం, వడ్డీలకు డబ్బులు తీసుకోవడం వంటివి కూడా చేసేవారు. ఈ విధంగా దాదాపు స్థానిక ప్రజల నుంచి రూ.2 కోట్లకు పైగానే వసూలు చేశారు. కొన్నాళ్లుగా దుర్గా దేవి, తారక రామారావు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో స్కీం సభ్యులకు ఆభరణాలు ఇవ్వడం, అప్పు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించడం కష్టంగా మారింది.
ఒకరి వద్ద నుంచి తీసుకుంటూ మరొకరికి చెల్లించడం
దీంతో ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరొకరికి చెల్లించడం వంటివి చేస్తూ ఉండేవారు. చీటీ పాడుకున్న వారికి రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు వడ్డీ ఇస్తామంటూ నమ్మకంగా చెప్పి ఆ డబ్బులు ఇచ్చేవారు కాదు. చీటీలీ వేసిన వారు కూడా లక్షల్లోనే వారికి డబ్బులు ఇచ్చారు. ఈక్రమంలోనే తారక రామారావు ఆరోగ్యం పాడైంది.ఆయన ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లేవలేని స్థితికి చేరుకున్నారు. దీంతో చీటీలు వేసిన వారికి డబ్బులు చెల్లించడం కష్టంగా మారింది. తిరిగి తీర్చే పరిస్థితి లేకపోవడంతో వారిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా భవానీపురం బాల భాస్కర్ నగర్ లోని దుర్గా దేవి నివాసంలో ఇద్దరూ కలిసి శనివారం సాయంత్రం పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని బంధువులు ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు తెలిపారు.
నెలరోజుల కిందటే తారక రామారావు కుమార్తె పెళ్లి
అయితే తారక రామారావు, దుర్గా దేవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్నట్లు తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు. లక్షల్లో డబ్బులు చెల్లించామంటూ పోలీసుల వద్ద మొర పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూనే.. కన్నీటి పర్యంతం అయ్యారు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని చిట్టీలు వేశామని... ఆ డబ్బులే తమకు ఇప్పుడు ఆధారం అంటూ బాధితులంతా తమ కష్టాలను పోలీసులకు వివరించారు. తారక రామారావు కుమార్తెకు నెల రోజుల కిందట వివాహం చేశారు. నెల రోజులకే ఆయన చనిపోవడంతో స్థానికంగా విషాధం నెలకొంది.