Conspiracy to murder MLA Kotam Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హత్యకు రౌడీషీటర్ల కుట్ర - సంచలనం సృష్టిస్తున్న వీడియో
MLA KotamReddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర చేస్తున్న వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. పెరోల్ వివాదంలో ఉన్న శ్రీకాంత్ అనుచరులే చంపాలని ప్లాన్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

Nellore Rural MLA: నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి రౌడీ షీటర్లు కుట్ర చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ హోటల్ రూములో మద్యం తాగుతూ వీరు ప్లాన్ గురించి చర్చించుకుంటున్న వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో ఉన్న వారంతా రౌడీ షీటర్లే. వారంతా జైలులో శ్రీకాంత్ ముఠాలో కీలక సభ్యులు. జగదీష్, మహేష, వినీత్ అనే వ్యక్తులతో ఈ వీడియోలో కనిపించారు. వీరంతా పలు నేరాల్లో నిందితులు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. విచారణ ప్రారంభించారు.
ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది.. ఎవరు వీడియో షూట్ చేశారన్నదానిపై పోలీసులు వివరాలు వెలికి తీస్తున్నారు. ఈ రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లుగా తెలు్సతోంది. నిజానికి శ్రీకాంత్ కు పెరోల్ కోసం సిఫారసు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఇంతకు ముందు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు కూడా. అయితే తన సిఫారసు లేఖ రిజెక్ట్ అయిందని అయన చెప్పారు. ఈ విషయాన్ని ఓ గుణపాఠంలా ఉంచుకుని భవిష్యత్ లో ఎవరికీ పెరోల్ ఇవ్వనని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయననే ఈ ముఠా హత్య చేయాలనుకోవడం ఏమిటన్న ప్రశ్న పోలీసు వర్గాలకు వస్తోంది.
కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బు వస్తుదంని మాట్లాడుకున్నారు.. ఎవరు ఇస్తారని.. బేరం పెట్టారన్న విషయం కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. ఈ దిశగా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో వ్యవహారంపై కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్న నిడిగుంట అరుణ, జైల్లో ఉన్న శ్రీకాంత్ తో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారని.. వీరి వెనుక వైసీపీకి చెందిన ఓ బడా నేత ఉన్నారన్న ప్రచారాన్ని కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఎప్పుడూ కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట ఉండే కొంత మంది అనుచరుల్ని డబ్బుతో లోబర్చుకున్నారని అంటున్నారు. శ్రీధర్ రెడ్డి సిఫారసు మీదనే పెరోల్ మీద వచ్చి.. ఆయననే మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు.. అందుకే ఆయనకు పెరోల్ కోసం అన్ని రకాల ఒత్తిళ్లు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే.. వచ్చే ఎన్నికల్లో సూళ్లూరు పేట లేదా మోర స్థానం నుంచి నిడిగుంట అరుణకు టిక్కెట్ ఇస్తామని బడా వైసీపీ నేత భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అందుకే ఆమె హత్యకు ప్లాన్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏకంగా ఎమ్మెల్యేను హత్య చేయడానికి కుట్ర పన్నడం.. అందుకే రౌడీ షీటర్ ను బయటకు తీసుకు వచ్చారన్న అనుమానాలు రావడంతో.. కలకలం రేపుతోంది. ఆయనను చంపితే ఎవరికి లాభం.. ఆ వైసీపీ బడా నేత ఎవరు అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.





















